సాధారణంగా ప్రభుత్వం మారిందంటే.. పాత ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకవేళ పాత పథకాల్లో పంపిణీ చేస్తున్న వస్తువులపై ఎక్కడైనా పాత సీఎం పేరు లేదా ఫొటో ఉంటే వాటిని వెంటనే నిలిపి వేసి.. వాటి స్థానంలో కొత్త సీఎం లేదా ఫొటోతో కొత్త వస్తువులను సిద్ధం చేసి సరఫరా చేస్తుంటారు.  ఇది సహజంగా జరిగేదే.


కానీ దీనికి భిన్నంగా జగన్ ప్రారంభించిన విద్యా కానుక పేరుతో అచ్చు వేసిన వస్తువులు ఉన్నాయి. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు వీటిని పంపిణీ చేస్తారా లేక వాటిని ఆపేసి కొత్త వాటిని ఆర్డర్ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారనే విషయం తెగ వైరల్ అవుతోంది.


జగనన్న విద్యా కానుకలో భాగంగా మాజీ సీఎం బొమ్మ, పేరు ఉన్న వస్తువులను యథాతదంగా పంపిణీ చేయాలని.. విద్యార్థులకు అవి సకాలంలో చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. నిజంగా ఏపీ సీఎం జగన్ ఫొటోలు ఉన్న వస్తువులను పంచమని చెప్పారా అంటే.. దీనిపై సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది.


సోషల్ మీడియాలో జగన్ ఫొటోతో ఉన్న కిట్ల పంపిణీపై సమగ్ర శిక్ష అభియాన్ స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జగన్ ఫొటో ఉన్న స్టూడెంట్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. సమగ్ర శిక్ష అభియాన్-2024 విద్యా సంవత్సరానికి గాను సరఫరా చేసే వస్తువులపై ఎలాంటి రాజకీయ చిహ్నాలు, కానీ ఫొటోలు కానీ ముద్రించొద్దు అని గత మార్చిలోనే కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపింది. తమ ఆదేశాలకు అనుగుణంగా వాటి తయారీ, పంపిణీ జరుగుతుంది అని పాత స్టాక్ ఉంటే పంపిణీ చేయొద్దని కూడా ఆదేశాలిచ్చినట్లు సమగ్ర శిక్ష అభియాన్ తెలిపింది. మరి దీనిని టీడీపీ ఏ విధంగా సమర్థిస్తోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: