గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న భయంకర కరోనా వైరస్ మహమ్మారి రోజుకో రూపం మార్చుకుంటోందని పలు అధ్యయనాల్లో వెల్లడయిన విషయం తెలిసిందే. వైరస్ జన్యుమార్పిడి వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఓ అధ్యయనం మాత్రం ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ వ్యాక్సిన్‌పై ఆశలను పెంచింది.తొలినాళ్లలో గుర్తించిన కరోనా వైరస్, నాటి నుంచి దాని జన్యుక్రమంలో తక్కువ స్థాయిలోనే మార్పులు చోటుచేసుకున్నట్టు అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఏఐఆర్) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దీంతో మహమ్మారిపై ఒకే రకమైన వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన ఫలితాలను ప్రముఖ పీఎన్‌ఏఎస్‌ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా 84 దేశాల్లోని 18,514 మంది నుంచి సేకరించిన వైరస్‌ జన్యుక్రమాన్ని పరిశీలించారు. కరోనా వైరస్‌ మనిషిలోకి ప్రవేశించిన తర్వాత వారి శరీరానికి అనుగుణంగా మార్పు చెందినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని అధ్యయనం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జరిగిన మార్పులన్నీ ఒక క్రమ పద్ధతిలో కాకుండా యాదృచ్ఛికంగా జరిగినవేనని పేర్కొంది.


ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వైరస్ ఉత్పరివర్తన ఆధిపత్యాన్ని సూచించినట్టు ఇటీవల అధ్యయనాలు పేర్కొన్నాయి. దీనిలో అస్పార్టిక్ ఆమ్లం - డీగా సూచించగా, మరొక అణువు గ్లైసిన్.. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో అతిథేయ కణాలలోకి ప్రవేశించడానికి సహకరిస్తున్నట్టు గుర్తించారు. అయితే, జన్యు రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ రకాల్లో ఒకటైన ‘డీ614జీ’.. మనిషి శరీరానికి అనుగుణంగా మార్పు చెందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలేమీ లేవని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మోర్గానే రోలాండ్ వివరించారు. కానీ వైరస్‌ మొదలైనప్పటి నుంచి ఈ రకం వేగంగా రూపాంతరం చెందడం నిజమేనని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ మార్పునకు శరీరంలో సహకరిస్తున్న అంశాల్ని మాత్రం నిర్దిష్టంగా గుర్తించలేదని తెలిపింది. డీ614జీ ప్రభావాన్ని గుర్తించేందుకు మరింత లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వ్యాక్సిన్లతో కరోనా వైరస్‌ను కట్టడి చేసే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా, డెంగీ వంటి వ్యాధుల్లో వైరస్‌ రూపాంతరం వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. కానీ, కరోనా వైరస్‌లో మాత్రం ఆ స్థాయి పరివర్తనం లేదని స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి వ్యతిరేకంగా విస్తృత వ్యాక్సిన్ అభివృద్ధికి వైరల్ వైవిధ్యం అడ్డంకి కాదని రోలాండ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: