కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతూనే కొన్ని మంచి పనులు చేయాలి.. కొన్ని మంచి పనులకు కొనసాగింపుగా మనుష్యులంతా ఉండాలి. ఇదే ప్రతిపాదన ఇదే ప్రాతిపదికతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.. మంచి అనగా ఇతరుల క్షేమం కోరేది. మంచి అనగా ఇతరులకు ఏ హానీ చేయనిది. ఈ కొత్త ఏడాది చేసే ప్రతి పని గొప్ప ఫలితాలకు సంకేతం కావాలి. అంతేకాదు మంచి నిర్ణయాలకు ఆనవాలు కావాలి. పురోగతి అన్నది జీవితాన్ని శాసించాలి. పురోగతి, ప్రగతి అన్నవి మానవ అభ్యున్నతికి సంకేతిక కావాలి. మన జీవితాల్లో వచ్చే ప్రతి మార్పూ రేపటికి దోహదకారి కావాలి. అటువంటి రోజు కొత్త ఏడాదిలో పలకరిస్తే మంచి పరిణామాలకు అదే సంకేతిక.
ఏడాదిలో ఆరోగ్యం,కాలంతో చేసే ప్రయాణంలో ఆనందం అన్నవి చాలా ముఖ్యం. అదేవిధంగా కొత్త ప్రణాళికలతో కూడిన జీవితం కూడా ఎంతో అవసరం..ఆవశ్యకం. ఈ ఏడాది కరిగి కొత్త ఏడాదిలో కలిసి పోతుంది. పోత పోసుకున్న క్షణాలు అన్ని ఏదో ఒక చోట నిలిచి కొత్త అర్థం వెతికి వస్తాయి. మనం మనలానే ఉండడం అన్నది సాధ్యం కాని పని అని చదివేను. ఎవ్వరయినా ఎవ్వరిలానో ఎందుకు ఉండాలి అని అనుకుంటారు కానీ ప్రాభావాలను మాత్రం వదిలిపోవడం కుదరని పని. కావాల్సినంత స్వేచ్ఛ జీవితం నుంచి తీసుకోవడం ఓ బాధ్యత.. అనుభవించడం హక్కు. స్వేచ్ఛను అనుభవిస్తూ మంచి నిర్ణయాలకు ఆనవాలుగా నిలవడమే ఇప్పటి ప్రథమ కర్తవ్యం.
- రత్నకిశోర్ శంభుమహంతి