మనదేశంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో ఒకటి ‘రక్షా బంధన్’. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లు వారి మధ్య బంధం కలకాలం నిలిచిపోవాలని జరుపుకునే అతి ముఖ్యమైన ఫెస్టివల్ ‘రాఖీ’.  ‘రాఖీ పౌర్ణమి’గా పిలవబడే ఈ పండుగ నేపథ్యంలో అన్న లేదా తమ్ముడికి అక్కా లేదా చెల్లెలు రాఖీ కడుతుంటారు. ఇక సోదరులు తమ సోదరికి జీవితాంతం తోడుగా ఉంటామని ఈ సందర్భంలో భరోసా ఇస్తుంటారు. ఈ ‘రాఖీ పౌర్ణమి’ ఫెస్టివల్‌ను కొన్ని ప్రాంతాలలో ‘శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి’ అని అంటుంటారు. ఈ పండుగు ప్రతీ ఏడాది ఆగస్టు 22న వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ప్రజలు జరుపుకుంటుండటం విశేషం.

రాఖీ సందర్భంలో తమ సోదరుడు బాగుండాలని, ఇంకా ఉన్నతంగా ఎదగాలని సోదరీమణులు ఆకాంక్షిస్తుంటారు. ఈ రాఖీ పండుగ మొదలు కావడానికి ఓ చరిత్ర కూడా ఉంది. అదేంటంటే.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య కొద్ది కాలం పాటు ఫైట్ జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు అయిన దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ తీసుకుని వెళ్లి అమరావతిలో ఉండిపోయాడు. ఆ సమయంలో భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి భర్తను యుద్ధం చేయాలని చెప్తుంది. లేదంటే అమరావతిని రాక్షసరాజు చుట్టుముట్టి అందరినీ సంహరిస్తాడని తెలుపుతుంది. ఆమె మాట విన్న దేవేంద్రుడు యుద్ధానికి సన్నద్ధమవుతాడు.

ఇక ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది ఇంద్రాణి. దేవతలందరూ అటువంటి రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో నెగ్గుతాడు. తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదించి పూర్వ వైభవాన్ని పొందుతాడు. ఈ విధంగా రక్షా బంధనం ప్రారంభమైందని తెలుస్తోంది. అలా అప్పటి నుంచి రాఖీ పౌర్ణమి నిర్వహించుకోడం స్టార్ట్ అయిందట. ఇక కాలక్రమంలో ‘రాఖీ పౌర్ణమి’ పండుగ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య బంధంగా మారిందన్న సంగతి అందరికీ విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: