స్మార్ట్‌ఫోన్ నేడు మన జీవితంలో ఒక అంతర్భాగమైపోయింది. అయితే ఫోన్ వినియోగంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దాని ఆయుష్షును, ముఖ్యంగా అత్యంత ఖరీదైన 'డిస్ప్లే'ను దెబ్బతీస్తాయి. చాలామంది ఫోన్ స్క్రీన్ జాగ్రత్తగా ఉండాలని టెంపర్డ్ గ్లాస్ వేయిస్తారు కానీ, రోజువారీ అలవాట్లలో చేసే పొరపాట్ల వల్ల డిస్ప్లే అంతర్గతంగా పాడవుతుందని గమనించరు.

ప్రధానంగా ఫోన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ గరిష్ట స్థాయిలో (Maximum Brightness) ఉంచడం వల్ల స్క్రీన్ పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల 'స్క్రీన్ బర్న్-ఇన్' సమస్య తలెత్తి, డిస్ప్లే రంగులు వెలిసిపోయినట్లు కనిపిస్తాయి. అవసరం లేకపోయినా బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంచడం వల్ల బ్యాటరీతో పాటు డిస్ప్లే నాణ్యత కూడా క్రమంగా తగ్గుతుంది. ఆటో-బ్రైట్‌నెస్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అరికట్టవచ్చు.

ఫోన్‌ను శుభ్రం చేసే విషయంలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. కళ్లద్దాల క్లీనర్లను, గ్లాస్ క్లీనర్లను లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను నేరుగా స్క్రీన్ పై చల్లడం. ఇలా చేయడం వల్ల డిస్ప్లే పై ఉండే 'ఒలియోఫోబిక్ కోటింగ్' (వేలిముద్రలు పడకుండా చూసే పొర) దెబ్బతిని, స్క్రీన్ జిడ్డుగా మారుతుంది. దీనికి బదులుగా మెత్తటి పొడి మైక్రోఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడాలి. ఒకవేళ మొండి మరకలు ఉంటే వస్త్రాన్ని స్వల్పంగా తడిపి తుడవడం ఉత్తమం.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫోన్‌ను ఎండలో లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో (ఉదాహరణకు కారు డాష్‌బోర్డ్ మీద) ఉంచడం. అధిక ఉష్ణోగ్రత వల్ల డిస్ప్లే లోపల ఉండే పిక్సెల్స్ శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉంది. అలాగే మనం పడుకునేటప్పుడు ఫోన్‌ను దిండు కింద పెట్టుకోవడం వల్ల ఫోన్ పై ఒత్తిడి పెరగడమే కాకుండా, గాలి ఆడక అది వేడెక్కి డిస్ప్లే ప్యానెల్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

జేబులో లేదా బ్యాగులో ఫోన్ పక్కన తాళం చెవులు, నాణేలు వంటి లోహపు వస్తువులను ఉంచడం వల్ల స్క్రీన్ పై కంటికి కనిపించని సూక్ష్మ గీతలు పడతాయి. వీటితో పాటు చౌకబారు ఛార్జర్లు వాడటం వల్ల విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఏర్పడి, టచ్ సెన్సార్లు సరిగ్గా పనిచేయకుండా పోవచ్చు. డిస్ప్లే మార్చడం అనేది ఫోన్ కొన్న ధరలో సగానికి పైగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, ఈ చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మీ ఫోన్ స్క్రీన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: