ఓటములు ఎన్ని ఎదురోచ్చినా..కష్టపడి పనిచేసుకుంటూ, ప్రజలకు అండగా ఉంటే విజయం ఆటోమేటిక్‌గా దక్కుతుందని అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిరూపించారు.  మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్...2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున అవనిగడ్డ నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఇక తర్వాత జరిగిన పరిణామాల్లో రమేష్, వైసీపీ వైపుకు వచ్చేశారు. అదే క్రమంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రెండుసార్లు వరుసగా ఓడిపోయిన కూడా రమేష్ వెనక్కి తగ్గలేదు. నిత్యం ప్రజలతోనే ఉంటూ, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. పార్టీని బలోపేతం చేసుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో రమేష్ మంచి మెజారిటీతో, మండలి బుద్దప్రసాద్‌పై విజయం సాధించారు. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్...ఏ మాత్రం హడావిడి లేకుండా సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు.

ప్రజలకు సాధ్యమైన మేర పనులు చేసిపెడుతున్నారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ, ప్రజలని కాలుస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమల్లో ఎలాంటి లోటు రానివ్వడం లేదు. టీడీపీ కార్యకర్తలకు సైతం పథకం అందేలా చేస్తున్నారు. అటు నియోజకవర్గంలో కొత్తగా సి‌సి రోడ్లు, సచివాలయాలు, నాగాయలంక-బందరు బైపాస్ రోడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. పెద్దగా వివాదాల జోలికి పోనీ రమేష్, మంచి పనితీరుకు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల సైతం వైసీపీ వైపుకు వస్తున్నారు. ఇప్పటికే బలమైన టీడీపీ నేతలు రమేష్‌కు మద్ధతు తెలిపారు. అలాగే కరోనా కట్టడి కోసం ఎమ్మెల్యే బాగానే కృషి చేస్తున్నారు.

ఇక ఈ మధ్య వర్షాలు పడటం వల్ల నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యాయి. వాటిని బాగుచేయాల్సిన అవసరముంది. జిల్లాకు బోర్డర్‌లో ఉన్న ఈ నియోజకవర్గంలో అతివృష్టి, అనావృష్టి అన్నట్లు పరిస్థితిలు ఉంటాయి. వస్తే భారీగా వరదలు వచేస్తాయి. లేదంటే నీటికి కటకటాలాడే పరిస్థితి ఉంటుంది. ఇక గత ప్రభుత్వం హయాంలో జరిగిన స్వచ్చ అవనిగడ్డ కార్యక్రమం ఇప్పుడు జరగట్లేదు. అలాగే ఇక్కడ ఇసుక అక్రమాలు కూడా ఎక్కువ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అటు నియోజకవర్గానికి చివరిన ఉన్న ఎదురుమొండి దీవుల ప్రజల కష్టాలు వర్ణాతీతం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ ఉంది. కృష్ణా జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు.

గత చంద్రబాబు ప్రభుత్వం ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అటు ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది. ఇక ఎదురుమొండిలోనే కాకుండా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రహదారుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక రాజకీయ పరంగా చూసుకుంటే రమేష్ ఇక్కడ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇటు టీడీపీ సీనియర్ నేత మండలి బుద్దప్రసాద్ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో రమేష్‌కు ప్లస్ అవుతుంది. మొత్తానికైతే రమేష్ సైలెంట్‌గా తనకు సాధ్యమైన మేర పనులు చేసుకుంటూ వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: