శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్‌కు గురించి చెప్పాల్సిన పనిలేదు. జిల్లా రాజకీయాలపై వీరికి మంచి పట్టుంది. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులు ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జిల్లా వైసీపీకి వీరే పెద్ద దిక్కు. ఇందులో ప్రస్తుతం ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రసాదరావు, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మొన్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. నియోజకవర్గంపై ధర్మానకు మంచి పట్టు ఉంది. మంచి వక్త కావడంతో అటు అసెంబ్లీలో గానీ, మీడియా సమావేశాల్లో గానీ టీడీపీకి చురకలు అంటించడంలో ముందున్నారు. ఇక మూడు రాజధానుల ప్రకటన సందర్భంలో అసెంబ్లీలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి మాట్లాడి అందరి మనసులు కదిలించారు. అటు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి కావడంతో అధికారులకు చెప్పి ఏ పనైనా చేయించుకోగలుగుతున్నారు.

సోదరుడు మంత్రి కావడంతో కావాల్సిన పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. అయితే కృష్ణదాస్ మంత్రివర్గంలో ఉండటంతో ప్రసాదరావుకు మంత్రిగా ఛాన్స్ దక్కలేదు. కానీ జగన్ మళ్ళీ కేబినెట్ విస్తరణ చేస్తే అప్పుడు ధర్మానకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ తరుపున గుండా లక్ష్మీ పనిచేస్తున్నారు. గుండా ఫ్యామిలీకి శ్రీకాకుళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే వయసు మీద పడటంతో గుండా లక్ష్మీ పెద్ద యాక్టివ్‌గా లేరు. కానీ శ్రీకాకుళంలో టీడీపీ కేడర్ బలంగానే ఉంది. అటు వైసీపీ కేడర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది.

ఇక శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో శ్రీకాకుళం మున్సిపాలిటీతో పాటు గార మండలం కూడా ఉంది. 150 సంవత్సారాలు పైబడ్డ పురపాలక సంస్థతోబాటు, 60 ఏళ్లకు పైబడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్ర ఆసుపత్రి, దంతవైద్యకళాశాల, అతిపెద్ద వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ కళాశాలలు ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు. అయితే నియోజకవర్గంలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగు నీళ్లు, సాగు నీరు కొరకు ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. నాగావళి,  వంశధార నదులలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలను కొత్త ఇసుక విధానం ఏమాత్రం అరికట్టలేకపోతున్నది. అరసవల్లి, శ్రీకూర్మము, శాలిహుండం, శ్రీముఖలింగం వంటి పుణ్యక్షేత్రాలను ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: