రాజకీయ నాయకులు అధికారం లేకపోతే ఉండలేరు. రాజకీయాల్లో ఏది ఎలా చేసిన చివరి టార్గెట్ అధికారమే. ఆ అధికారం దక్కకపోతే పార్టీ జంప్‌లు కూడా చేసేస్తారు. ఇక ఇలాంటి జంపింగులు ఏపీలో చాలా సాధారణం. ప్రస్తుతం అధికారంలో వైసీపీలోకి నాయకులు వెళుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం జగన్‌కు జై కొట్టారు. గెలిచాక కొన్ని రోజులు జనసేనలో యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ హఠాత్తుగా జగన్ భజన మొదలుపెట్టి, వైసీపీలో హడావిడి చేయడం మొదలుపెట్టారు.


అలా అలా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారిపోయారు. అందుకే ఇటీవల కూడా ఆయన తాను జగన్ మనిషే అని ప్రకటించేసుకున్నారు. ఎన్నికల్లో తనకు వైఎస్సార్ సీపీ టిక్కెట్ ఇస్తానని చెప్పిందని, బొంతు రాజేశ్వరరావు అడ్డు పడడంతోనే ఆగిపోయిందని, అయినప్పటికీ.. జగన్‌కు తనకు మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని, అందుకే తాను జనసేనను వదిలేసి.. వైఎస్సార్ సీపీ నేతగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నానని తేల్చేశారు.


ఇక వైసీపీ వైపు వచ్చాక రాపాకకు ఏమన్నా కలిసొచ్చిందా అంటే....కొంతవరకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు. నియోజకవర్గ పరంగా వచ్చే నిధుల విషయంలో ఎలాంటి లోటు లేకుండా పోయింది. పార్టీ మారడం వల్ల రాజోలు ప్రజలకు ఎలాంటి లాభం జరుగుతుందో తెలియదుగానీ, రాపాకకు మాత్రం బాగానే కలిసొచ్చింది. కాకపోతే రాజోలులో వైసీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలే ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. పార్టీలో ఉన్న అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులు కూడా రాపాకతో పాటు దూకుడుగా ఉన్నారు.


అయితే దీని వల్ల రాజోలు వైసీపీ మూడు ముక్కలుగా మారింది. దీని వల్ల పార్టీకే డ్యామేజ్ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జగన్ ఎవరొకరిని ఇన్‌చార్జ్‌గా పెట్టకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో రాపాకకు సీటు వచ్చే విషయంలో కూడా గ్యారెంటీ లేదు. ఇదే సమయంలో నియోజకవర్గంలో జనసైనికులు నెక్స్ట్ రాపాకని చిత్తుగా ఓడించాలనే కసితో ఉన్నారు.


ఇక ఇక్కడ టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు బాగా యాక్టివ్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. నిదానంగా టీడీపీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు గొల్లపల్లికి కలిసొచ్చే అవకాశముంది. మొత్తానికి చూసుకున్నట్లైతే రాజోలులో రాపాకకు మున్ముందు కష్టాలు ఎక్కువగానే ఉండేలా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: