గత కొన్ని దశాబ్దాలుగా ఏపీ రాజకీయాలు కమ్మ వర్సెస్ రెడ్డి అనే విధంగానే నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కాంగ్రెస్ ఉన్నప్పుడు వైఎస్సార్ వర్సెస్ చంద్రబాబుగా ఉంటే, ఇప్పుడు వైసీపీ వచ్చాక జగన్ వర్సెస్ చంద్రబాబుగా సాగుతున్నాయి. అంటే చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీలో ఆ వర్గం నేతల హవా ఉంటుంది. అటు జగన్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు. అందుకే వైసీపీలో రెడ్ల హవా ఉంటుంది.


అయితే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు పలు నియోజకవర్గాల్లో కమ్మ వర్సెస్ రెడ్డి వర్గాల మధ్యే పోరు నడుస్తాయి. అందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా గురజాల రాజకీయం ఇలాగే నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేయగా, టీడీపీ నుంచి యరపతినేని శ్రీనివాసరావు(కమ్మ) పోటీ చేశారు. ఇక జగన్ వేవ్‌లో కాసు విజయం సాధించారు. దాదాపు 28 వేల ఓట్ల తేడాతో మహేష్ విజయం సాధించాడు.


పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహేష్ రెడ్డి, నియోజకవర్గంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యకు చెక్ పెట్టడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్-బుగ్గవాగు ద్వారా తాగునీరు అందించడానికి చూస్తున్నారు. పైగా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్‌ల అభివృద్ధికి పాటు పడుతున్నారు.


అయితే అభివృద్ధి విషయంలోనే కాకుండా ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేయడంలో కూడా ముందున్నారు. ఆ పార్టీ చేసే విమర్శలని తిప్పికొడుతూనే తాము చేసే మంచి కార్యక్రమాలని ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు. అటు ప్రభుత్వ పథకాలు బాగా అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇక అంతా బాగానే ఉన్న కాసుకు కొంచెం దూకుడు ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. మాటతీరులో దురుసుతనం ఉంటుందని అంటున్నారు. పైగా ఇటీవల కొందరు కాలేజ్ విద్యార్ధులపై కూడా నోరు పారేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటి వల్లే కాస్త నియోజకవర్గంలో కాసుకు ఇబ్బందికర పరిస్తితి ఉందని తెలుస్తోంది.

 

అటు టీడీపీ తరుపున యరపతినేని గట్టిగానే కష్టపడుతున్నారు. కాసు టార్గెట్‌గా నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో కాసు అనుచరులు బ్లీచింగ్‌ పేరుతో నాసిరకం సున్నాన్ని సరఫరా చేస్తూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇవేగాక అనేక విమర్శలు కాసుపై చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో యరపతినేనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇసుకలో అక్రమాలకు పాల్పడ్డారని, చెప్పి ఆయనపై కేసులు ఉన్నాయి. ఇక ఏది ఎలా ఉన్న ప్రస్తుతం గురజాలలో మాత్రం కాసు బలంగానే ఉన్నారు. మరి రానున్న మూడేళ్ళలో యరపతినేని కాసుకు చెక్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: