వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్‌ని వీడి వైసీపీ పెట్టారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక జగన్ వైసీపీ పెట్టినప్పుడు కొంతమంది మాత్రమే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి వైసీపీలోకి వచ్చారు. అలా జగన్ వెంట నడిచిన వారిలో తెల్లం బాలరాజు కూడా ఒకరు. వైఎస్సార్‌కు అభిమాని అయిన బాలరాజు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోలవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


2009 ఎన్నికల్లో సైతం బాలరాజు మరోసారి పోలవరంలో గెలిచారు. కానీ వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌కు అండగా నిలిచారు. జగన్‌కు మద్ధతుగా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు. దీంతో 2012లో ఉపఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బాలరాజు వైసీపీ తరుపున నిలబడి భారీ విజయాన్ని దక్కించుకున్నారు.


ఇక 2014 ఎన్నికల్లో బాలరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయినా సరే జగన్‌కు సపోర్ట్‌గా ఉంటూనే వచ్చారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అందుకే 2019 ఎన్నికల్లో దాదాపు 42 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజుకు జగన్ కేబినెట్‌లో ఛాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు.


కానీ సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా బాలరాజుకు పదవి మిస్ అయింది. అయినా సరే ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి. అయితే నియోజకవర్గంలో రోడ్లు పరిస్తితి బాగోలేదు. వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అటు పోలవరం ప్రాజెక్టు విషయంలో ముంపు బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరముంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సరైన రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది.


రాజకీయంగా చూసుకుంటే పోలవరంలో బాలరాజు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇక్కడ టీడీపీ ఇంకా వీక్‌గానే ఉంది. ఇక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో బాలరాజుకు జగన్ ఛాన్స్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి బాలరాజుకు మంత్రిగా జగన్ అవకాశం ఇస్తారో లేదో? 

మరింత సమాచారం తెలుసుకోండి: