
మళయాళంలో మోహన్‌లాల్ యాక్ట్ చేసిన లూసిఫర్ తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్నాడు. సినిమా దర్శకుడిగా ఇప్పటికే సుజిత్, వినాయక్ పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు ధృవ ఒరిజినల్ వెర్షన్ 'తని ఒరువన్' డైరెక్టర్ మోహన్‌రాజా పేరును ఎనౌన్స్ చేశారు. చిరంజీవి నటించిన హిట్లర్ మూవీకి మోహన్‌రాజా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
లూసిఫర్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న రామ్‌చరణ్ దర్శకుడిగా సుజిత్ పేరును సజెస్ట్ చేశాడు. ఈ యంగ్ డైరెక్టర్ కథలో చేసిన మార్పులు చిరంజీవిని ఇంప్రెస్ చేయడకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ వినాయక్ దగ్గరకు చేరింది. ఠాగూర్, 'ఖైదీ నంబర్ 150' వంటి హిట్స్ తర్వాత ముచ్చటగా మూడో రీమేక్‌తో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంది. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. లూసిఫర్ మళ్లీ చేతులు మారింది.
ఎడిటర్ మోహన్ కొడుకైన మోహన్‌రాజా 2001లో తెలుగు సినిమా హనుమాన్‌జంక్షన్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆతర్వాత తెలుగులో హిట్టయిన జయం.. అమ్మనాన్న తమిళ అమ్మాయి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానాను తమిళంలో రీమేక్ చేసి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. రీమేక్ దర్శకుడిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం... లూసిఫర్ స్క్రిప్ట్ వర్క్ నచ్చడంతో ఫైనల్‌గా దర్శకుడిని ఎనౌన్స్ చేశారు.
నిర్మాతల దూకుడు చూస్తుంటే.. ఆచార్య రిలీజ్ కాకుండానే లూసిఫర్ రీమేక్ షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో షూటింగ్ ప్రారంభించి మార్చినాటికి ఫినిష్ చేస్తామంటున్నారు నిర్మాతలు. ఈలెక్కన సమ్మర్‌నాటికి ఆచార్యతోపాటు.. లూసిఫర్ రీమేక్ రిలీజ్‌కు రెడీగా ఉంటాయన్న మాట. వెనకాల వేదళం రీమేక్ ... బాబీ సినిమా లైన్ లో ఉండడంతో... స్పీడ్ పెంచాడు మెగాస్టార్.