కళా తపస్వి కె విశ్వనాధ్ అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన అభిమానం. ఆయన సినిమాలు అద్భుత కళా ఖండాలు తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్ళిన మహా దర్శకుడు ఆయన. విశ్వనాధ్ సినిమా అంటే అన్ని వర్గాల ఆడియన్స్ కి అమితాసక్తి ఉంటుంది. అడవిరాముడు వంటి మాస్ మూవీ రిలీజ్ అయి ఊపేసిన రోజుల్లో శంకరాభరణం అన్న క్లాస్ మూవీతో ఢీ కొట్టి తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన క్రెడిట్ అచ్చంగా విశ్వనాధ్ కే  దక్కుతుంది.

ఇక విశ్వనాధ్ దాదాపుగా యాభై దాకా సినిమాలు తీశారు. అవన్నీ ఆణిముత్యాలే. ఆయన సిరి సిరి మువ్వ. స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వయం కృషి, ఆపద్భాంధవుడు. శుభోదయం ఇలా ఎన్నో మరపురాని సినిమాలు తెలుగు సినిమా కళామతల్లికి హారతి పట్టినవి ఉన్నాయి.

విశ్వనాధ్ కళాభిరుచికి నిట్ట నిలువు సాక్ష్యాలుగా కూడా ఈ సినిమాలు ఉంటాయి. ఇదిలా ఉండగా విశ్వనాధ్ వంటి దిగ్దర్శకుడు సినిమా తీయడం అది రిలీజ్ కాకపోవడం అంటే నిజంగా సంచలనమే. కానీ అది జరిగింది. 1991 ప్రాంతంలో విశ్వనాధ్ సిరిమువ్వల సింహనాదం అని మూవీని తీశారు. ఈ సినిమా హీరోగా కూచిపూడి నాట్యకళాకారుడు కళా క్రిష్ణ నటించారు. హీరోయిన్ గా మాధురీమాల, విలన్ గా ఓంపురి నటిస్తే ముఖ్య పాత్రలో చంద్రమోహన్ నటించారు. ఈ మూవీ అద్భుతమైన కధతో సాగుతుంది.

ఇక మామ కెవీ మహాదేవన్ వద్ద  శిష్యరికం చేసిన పుహళేంది ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. నేనెవరో అనామికను, ఈ కధలో  అభిసారికను అంటూ ఎస్పీ శైలజ పాడిన పాట అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్. ఈ మూవీ కధాంశం కూడా వెరైటీగా ఉంటుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఒక కూచిపూడి కళాకారుడు కళ ద్వారానే బదులు తీర్చుకోవడం ప్రధాన ఇతి వృత్తం, మరి ఎందువల్ల ఆగిందో కానీ ఈ సినిమా రిలీజ్ కాక ఇప్పటికి మూడు దశాబ్దాలు అయింది.  మరి ఇప్పటికైనా ఈ మూవీని రిలీజ్ చేస్తే చూస్తామని కళాతపస్వి అభిమానులే కాదు కళా పిపాస ఉన్న వారు అంతా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: