డైలాగ్ కింగ్, అజాత శత్రువు సాయికుమార్ కు యాభై యేళ్ళు! అదేమిటీ ఆయన పుట్టింది 1960లో కదా అని కొందరికి అనుమానం రావచ్చు. బట్….నటుడిగా ఆయనకు ఇది 50వ సంవత్సరం. పన్నెండేళ్ళ చిరు ప్రాయంలో తొలిసారి మయసభలోని దుర్యోధనుడి పాత్ర కోసం ముఖానికి రంగు వేసుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత బాలనటుడిగా, యువ నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై సంవత్సరాల పాటు వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో నటించారు. తండ్రి పీజే శర్మ నుండి అబ్బిన నటనకు, వాచకానికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగారు సాయికుమార్. ఓ పక్క సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ చెప్పి, డైలాగ్ కింగ్ అనిపించుకున్నారు. ఇక ‘పోలీస్ స్టోరీ’ మూవీతో సాయికుమార్ సాధించిన సంచలన విజయం ఓ చరిత్ర. ఒకే ఒక్క సినిమాతో సాయికుమార్ జీవితమే మారిపోయింది. ఆ తర్వాత దాదాపు పాతిక చిత్రాలలో పోలీస్ పాత్రలు చేసి మెప్పించారు. వందలా ది సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. భాషా బేధం లేకుండా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే సాయికుమార్ తమ్ముళ్ళు కూడా సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టులుగా, నటులుగారాణిస్తున్నారు. అలానే సాయి కుమార్ కుమారుడు ఆది కూడా హీరోగా తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా సాయికుమార్ ‘ఈశ్వర్ అల్లా’ వంటి సందేశాత్మక చిత్రాన్నీ నిర్మించారు. రాజకీయ రంగంలోకి అడుగ పెట్టి, కన్నడనాట ప్రజా సేవకూ సిద్ధపడ్డారు. బీజేపీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెర మీద ప్రత్యేక కార్యక్ర మాలు చేస్తూ… తనదైన ముద్రను వేశారు. నటుడుగా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సాయికుమార్… మరింత గొప్ప పాత్రలను చేస్తూ… మరింత ఉన్న స్థితికి చేరుకోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: