ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని లక్షలాది మంది తెలుగు ప్రజలు రియల్ హీరోగా ఆరాధిస్తూ ఉంటే జగన్ మాత్రం నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అన్న విషయాన్ని తెలియచేస్తూ నందమూరి అభిమానులు కొత్త సందడి మొదలు పెట్టారు. సుమారు 19 సంవత్సరాల క్రితం 2000 వేల సంవత్సరంలో వచ్చిన బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ ఘన విజయం సాధించినందుకు ఆనందపడుతూ జగన్ కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘ నాయకుడుగా ఇచ్చిన ఒక పత్రికా ప్రకటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

అప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆంద్రప్రదేశ్ ను పాలిస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటూ పోరాడుతున్న రోజులు. అప్పటికి సుమారు పాతిక సంవత్సరాల వయసులో ఉన్న జగన్ అప్పట్లో బాలయ్య సినిమాలు అంటే విపరీతమైన అభిమానం కనపరిచేవారట. 

కాలేజీలో చదువుకున్న రోజుల నుండి జగన్ కు బాలయ్య సినిమాల పట్ల అభిమానం పెరగడంతో ఇలా బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షుడు అయ్యారు అని అంటారు. అయితే అలాంటి జగన్ తాను అభిమానించే బాలకృష్ణ మొన్నటి ఎన్నికలలో హిందూపూర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నప్పుడు బాలయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా బాలయ్య తెలుగుదేశం పార్టీని ఓడించమని జగన్ పిలుపును ఇచ్చారు. 

అయితే చంద్రబాబును తెలుగుదేశం పార్టీని విపరీతంగా విమర్శించే జగన్ బాలకృష్ణ పై ఇప్పటి వరకు ఎక్కడా తీవ్ర విమర్శలు చేయలేదు. దీనితో జగన్ కు ఇప్పటికీ బాలయ్య పై మనసులో అభిమానం కొనసాగుతోందా అంటూ ప్రస్తుతం మీడియాలో హడావిడి చేస్తున్న ఈవార్తలను చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: