ఎన్టీఆర్.. తెలుగు సినీరంగాన్ని, తెలుగు రాజకీయ రంగాన్నీ ఈ పేరుతో సంబంధం లేకుండా ఊహించుకోలేం.. అంతగా ఈ రెండు రంగాలతో పెనవేసుకుపోయిందీ పేరు. ఎన్టీఆర్ సినీ రంగ జీవితం ఎంత ఉజ్వలంగా వెలిగిందో అందరికీ తెలిసిందే. కానీ అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రాగలిగారు.. పార్టీ పెట్టీ పెట్టడంతోనే కేవలం 9 నెలల అతి తక్కువ కాలంలోనే.. అధికారం ఎలా హస్తగతం చేసుకోగలిగాడు..

 

 

ఇందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. ఇలా చరిత్రను ఒక్కసారి తిరగేస్తే.. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తుల్లో ఈనాడు దిన పత్రిక సంపాదకులు రామోజీరావు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. 1974లో పురుడు పోసుకున్న ఈనాడు దినపత్రిక ఎన్టీఆర్ పార్టీ పెట్టే నాటికి ఎనిమిదేళ్ల అనుభవం సంపాదించింది. తెలుగు నాట కొత్త జర్నలిజానికి వేగానికి ప్రతీకగా నిలిచింది. తెలుగు పాఠకులకు కొత్త దనాన్ని పరిచయం చేసింది. అలాంటి సమయంలో రామోజీరావు ఎన్టీఆర్ రూపంలో వస్తున్న రాజకీయ ప్రభంజనాన్ని సరిగ్గా అంచనా వేయగలిగారు.

 

 

అప్పటికే కాంగ్రెస్ పాలకులతో విసిగిపోయిన జనంలోని అసంతృప్తిని గమనించారు. ఇందిరాగాంధీ వంటి నాయకుల సీల్డు కవర్ రాజకీయాలు.. తెలుగు నాయకులంటే లెక్కలేని తనం వంటి దుర్భర పరిస్థితుల్లో రామోజీ రావు కూడా కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్న సమయం అది. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ పెట్టడంతో దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన రావడంతో రామోజీరావు కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

 

ఎన్టీఆర్ పర్యటనలకు కవరేజ్ బాగా పెంచాలని నిర్ణయించారు. అంతే అప్పటి నుంచి రామారావు పర్యటనల్నీ ఈనాడులో ప్రముఖంగా వచ్చేవి.. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేవి. అయితే ఏ ప్రాంతంలో ఏ సమస్యపై మాట్లాడితే జనం స్పందిస్తారో సమగ్ర అవగాహన ఉన్న ఈనాడు బృందం.. అప్పట్లో రామారావు ప్రసంగపాఠాలను కూడా తయారు చేసేదని.. ఆరోజుల్లో ఈనాడులో కీలక పాత్ర పోషించిన ఎంవీఆర్ శాస్త్రి ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్లో తెలిపారు. అలా రామారావు రాజకీయ జీవితాన్ని రామోజీ మలుపుతిప్పారన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: