ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరుకు ప్రేత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల్లోనూ ఈ పేరుకు.. ఈయ‌న పాడే పాట‌ల‌కు ప్ర‌త్యేక స్థానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన స్వరంలో అక్షరం అక్షర మై నిలుస్తుంది. హాస్యం లాస్యం చేస్తుంది. శృంగారం సింగారాలు పోతుంది. విషాదం మన కంట నీరొలికిస్తుంది. భక్తిభావం భగవద్దర్శనం చేయిస్తుంది. అందుకే ఆయ‌న పాట‌లు ఎన్ని విన్నా.. వినాల‌నిపిస్తుంది. అలాంటి  గాన గంధర్వుడు పద్మభూషణ్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు.

 

మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. 1966లో నటుడు, నిర్మాతా అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. ఆ త‌ర్వాత ఎన్నో పాట‌లు పాడి తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ మ‌రియు మలయాళ భాష‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. అలాంటి ‌బాలసుబ్రహ్మణ్యం.. ఇటీవ‌ల త‌న సొంతింటిని దానం చేసి ప్ర‌శంస‌లు అందుకున్నారు. 

 

తన స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న గృహాన్ని కంచి పీఠానికి వేద పాఠశాల నిర్వహణకు ఎస్పీబీ అందజేశారు. ఇంటికి సంబంధించిన పత్రాలను సైతం వారికి అందజేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి ఎస్పీ సాంబమూర్తి పేరిట ఈ పాఠశాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కంచి పీఠానికీ తన ఇంటిని అప్పగించిన బాలుగారిపై విజయదేంద్ర సరస్వతిగారు అప్ప‌ట్లో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అలాగే వేద పాఠశాల నిర్వహణకు తన సొంత ఇంటిని విరాళంగా ఇచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు నెటిజ‌న్లు. ఇప్పటి వరకు గాయకుడిగా ఆయన్ని అభిమానించిన తమకు ఇప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగిందంటూ కొనియాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: