అఖండ భారతావనిలో అన్ని ప్రాంతాలలోను జరుపుకొనే  దసరా అతిపెద్ద పండగ. ప్రతిసంవత్సరం శరదృతువులో అశ్వియుజ శుద్ద పాడ్యమి నుంచి దశమి వరకు ఉండే రోజులనే మనం దేవీ నవరాత్రులుగాపరిగణిస్తాం. అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ తొమ్మది రోజులలో జరిగే పూజలతో  దుర్గాదేవి అఖండ కాంతులతో వెలిగిపోతుంది.


విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పాండవులు అజ్ఞాతవాసానికి బయల్దేరే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం పై పెట్టి వెళ్ళి తమ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత విజయదశమి రోజు శమీవృక్షం పై పెట్టిన ఆయుధాలను కిందకు దింపి పూజలు  చేయడంతో  ఆశ్విజ శుద్ధ దశమి విజయదశమి గా మారింది అని అంటారు.  


అందువల్లనే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజలు చేసే ఆచారం మన భారతావనిలో ఉంది. రాముడు వానర సైన్యంతో కలిసి రావణాసురిడిని వధించన రోజు కూడా విజయదశమే కావడంతో  శ్రీరాముడు రావణుడి పై విజయం సాధించిన రోజును గర్తుకు చేసుకుంటూ   విజయదశమి రోజున చాలప్రాంతాలలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజయదశమి రోజు కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే విజయం చేకూరుతుంది అన్న నమ్మకం తరతరాల నుంచి ఉంది.



దసరా ఉత్సవాలలో దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి రకరకాల పిండివంటలతో నివేదనలు చేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము పఠిస్తూ శరన్నవరాత్రులు గా జరుపుతారు.   దసరాకు మరోపేరు దసరా పాపాలను హరించే పండుగ  అని అర్థం చెప్తారు. తెలుగు రాష్ట్రాలలో కనకదుర్గ అని కర్ణాటకలో చాముండీ దేవి అని బెంగాల్లో కాళికా మాత అని ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ  పేర్లతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది.
చెడును విశృంఖలత్వాన్ని నిర్మూలించడానికి అలాగే జీవితంలో అన్ని అంశాల పట్ల విషయాల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి అన్న ఆధ్యాత్మిక సందేశం ఈ శరన్ నవరాత్రులలో ఉంది. జ్ఞానోదయం కలగడమే కాకుండా మన జీవిత పరమార్ధాని తెలియచేసే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఈ నవరాత్రులలో ఉన్నాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడుస్తున్న కరోనా ను దేవి మాత తన అద్భుత శక్తితో మన దేశం నుండి తరిమికొట్టి అందరికి మంచి చేయాలని కోరుకుందాం. ఈ దసరా వైభవం అందరికి సకల శుభాలు కలిగించాలని కోరుకొంటూ ఇండియా హెరాల్డ్  అందరికి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: