తమిళ్ ఇండస్ట్రీలో  స్టార్‌ హీరోగా కొనసాగుతునే ఇతర భాషల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు విజయ్ సేతుపతి. దళపతి విజయ్‌ ‘మాస్టర్’‌ సినిమాలో విలన్‌గా నటించి మంచి విలన్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన ఉప్పెన మూవీలోని రాయనం పాత్రతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు.. స్టోరీ నచ్చితే చాలు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్దమేనని మరోసారి నిరూపించుకున్నాడు సేతుపతి. ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్‌ చిత్రలతో పరిచయం అయ్యాడు విజయ్‌. తెలుగులో డబ్బింగ్ అయిన పిజ్జా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ స్టార్ హీరో.

ఇదిలా ఉండగా... ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూనే.. ఇతర భాషల్లో కూడా నటిస్తున్నాడు విజయ్. ఇక వేసవిలో విజయ్ నటించిన 4 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తుగ్లక్ దర్బార్, లాబామ్, యాధుమ్ ఒరే యావరుం కేలిర్, మామనితమ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే ఈ సినిమాలు వాటి విడుదల తేదీలను ప్రకటించనున్నారు. ఇక 2018లో తమిళంలో వచ్చిన డార్క్ కామెడీ చిత్రం "నల్లా నాల్ పాత్ సోల్రెన్" తెలుగులో ఓ మంచి రోజు చూసి చేప్తా పేరుతో విడుదల కానుంది. దీంతోపాటు 2019లో సూపర్ హిట్ సాధించిన విజయ్ సినిమా సూపర్ డీలక్స్ కూడా ఈ వేసవిలో తెలుగులో విడుదల కానుంది.

ఇందులో విజయ్ ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించాడు. త్యాగరాజన్ కుమార రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విభిన్న కథల సమాంతరంగా సాగిన ఈ సినిమాలో సమంత, ఫాహద్, రమ్యకృష్ణ, మిస్కిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్ తీసుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ సాధించనుందా ? లేదా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: