‘బాహుబలి’ లో శివగామి గా తన సత్తాను చూపెట్టిన రమ్యకృష్ణ హవా గోదావరి పుష్కరాలను కూడ ప్రభావితం చేస్తూ పుష్కర స్నానాలలో కూడ శివగామి పోజులతో సెల్ఫీ ఫోటోలు కొంతమంది మహిళలు తీయించుకుంటున్నారు అంటే ఈ పాత్ర తెలుగు ప్రజల హృదయాలకు ఎంత దగ్గర అయిందో అర్ధం అవుతుంది. అటువంటి శివగామి ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేటి తరం హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుత తరం హీరోయిన్స్ లో చాలామందికి కష్టపడే మనస్థత్వం తగ్గి పోతోందని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను హీరోయిన్ గా నటించే రోజులలో ఒక సీన్ కు సంబంధించి ఒక డైలాగ్ పూర్తి చేసిన తరువాత ఆ తరువాత వచ్చే రెండవ సీన్ లో ఎలా నటించాలి అంటూ సహ నటులతో మాట్లాడుతూ ఉండేవారమని అయితే ఇప్పటి తరం నటీమణులు తమ సీన్ కు సంబంధించిన డైలాగ్ పూర్తి కాగానే తమ విలాసవంతమైన కార్వాన్ వ్యాన్ లోకి వెళ్ళిపోయి తమ సెల్స్ కు వచ్చిన మెసేజ్ లు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు అంటూ విమర్శలు చేసింది రమ్యకృష్ణ.

ఇక తాను ‘బాహుబలి’ లో చేసిన శివగామి పాత్ర గురించి మాట్లాడుతూ చాలామంది తనను పొగుడుతూ మెసేజ్ లు పెడుతున్నారని ఆ పాత్రలో తాను అంత బాగా రాణించాను అంటే ఆ డైలాగ్స్ తాను తన సొంత గొంతుతో పలికాను కాబట్టి ఆ భావాలు తన ముఖ కవళికల్లో కనిపించాయని అభిప్రాయ పడింది రమ్యకృష్ణ. అయితే నేటితరం హీరోయిన్స్ కు తాము పలుకుతున్న తెలుగు డైలాగులకు కూడ అర్ధం తెలియని నేపధ్యంలో ముఖంలో ఎక్స్ ప్రేషన్స్ ఎలా చూపెట్టగలరు అంటూ ప్రశ్నించింది శివగామి.

ఈ సినిమాలో తాను ఇంత అద్భుతంగా నటించ గలిగాను అంటే తనకు ఇచ్చిన ప్రతి సీన్ లోను ఎలా నటించాలో ఒకటికి పది సార్లు నటించి చూపించిన రాజమౌళికి ఆ క్రెడిట్ దక్కుతుందని కామెంట్ చేసింది. అంతేకాదు ఏ నటికైనా ఇటువంటి పాత్రలు జీవితంలో ఒకే ఒక్కసారి దక్కుతాయని ఎప్పుడూ అటువంటి పాత్రల కోసం ఎదురు చూడటం దురాశ ఆని కామెంట్ చేస్తోంది ఈనాటి టాలీవుడ్ శివగామి..
  



మరింత సమాచారం తెలుసుకోండి: