మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి.. అనేది పాత మాట. మేమిద్దరం విడిపోతున్నాం.. మమ్మల్ని అర్థం చేసుకోండి అనేది కొత్త మాట. అవును, ఇటీవల కాలంలో సెలబ్రిటీల జంటల విడాకులు కామన్ అయిపోయింది. ఒకరా ఇద్దరా, పెద్ద కుటుంబాలా, చిన్న కుటుంబాలా.. పెళ్లై నెలలు గడిచాయా, సంవత్సరాలు పూర్తయ్యాయా..? పిల్లలున్నారా లేదా..? ఇవేవీ పట్టించుకోవడంలేదు. పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత కూడా విడిపోతున్న జంటలున్నాయి, అసలు పిల్లా పీచూ లేకుండానే తెగతెంపులు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఇలా విడాకుల జాబితాలో చేరారు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్.

విడిపోతున్నామంటూ ప్రకటన..
ఆమధ్య రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా అదే బాటలో తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు. ధనుష్-ఐశ్వర్య అన్యోన్యంగా కనిపించేవారు. సినిమా ఫంక్షన్లు, ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా చూడ ముచ్చటగా ఉండేవారు. అలాంటి ఈ జంట ఇలాంటి షాకింగ్ న్యూస్ చెబుతుందని ఎవరూ ఊహించలేదు. గొడవలున్నట్టు పుకార్లు ఉన్నా కూడా అవన్నీ గాలి వార్తలే అనుకున్నారంతా. కానీ చివరకు ఇలా ఇద్దరూ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఎవరికి వారే తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విడాకుల ప్రకటన విడుదల చేశారు.


 

రజినీ రియాక్షన్ ఏంటి..?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో విడిపోతున్న జంటలకు మంచి మాటలు చెప్పి కలిపే ఉదాత్తమైన క్యారెక్టర్లలో నటించారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ఇద్దరు కూతుళ్లు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే వ్యక్తిగతంగా వారి నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందే. కానీ పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తల్లిదండ్రులిద్దరూ విడివిడిగా ఉంటే.. కచ్చితంగా ఆ ప్రభావం చిన్నారుల భవిష్యత్తుపై కూడా పడుతుందనే ఆందోళన ఉంటుంది. మొత్తానికి 2004 నవంబర్ -18న అప్పటికి ఓ అప్ కమింగ్ హీరోగా ఉన్న ధనుష్ ని వివాహం చేసుకుని సంచలనం సృష్టించిన ఐశ్వర్య, ఇప్పుడు విడాకుల ప్రకటనతో అంతే కలకలం రేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: