ఏం జరిగిదంటే.. గుడిగంటలు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అందులో పాత్ర ప్రకారం ఎన్టీఆర్ నిట్టూర్పుకో సిగరెట్ వూదేస్తుంటారు. రామారావు మామూలుగా సిగరెట్లు కాల్చరు. సినిమాలో సిగరెట్ కాల్చే వేషముంటే మాత్రం రెండు డబ్బాల స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్లు కాల్చేవారు. గుడిగంటలు షెడ్యూలులో ఆయనకోసం రోజూ రెండు డబ్బాల స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్ తెప్పించేవారు నిర్మాత డూండీ. ఫారిన్ సిగరెట్లు కావడంతో అవి ఎక్కడంటే అక్కడ దొరికేవి కావు. ఉదయం 9 గంటలకు ఒక డబ్బా, మద్యాహ్న భోజనానంతర షాట్ లో మరొక డబ్బా ఎన్టీఆర్ కు అందించాలి.
ఒకరోజు మధ్యాహ్నం భోజానాలయ్యాక ముళ్ళపూడి వద్ద సిగరెట్లు లేకుంటే, డూండీ ఎన్టీఆర్ కోసం తెప్పించిన రెండవ డబ్బా తెప్పించి, సీల్ తీసి రెండు సిగరెట్లు తీసుకొని ఇద్దరూ కాల్చుకున్నారట. ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుని, మేకప్ చేయించుకుంటూ సిగరెట్ టిన్ కోసం కబురెట్టారట. ఆ సిగరెట్ టిన్ సీల్ ఓపన్ చేసి అందులో రెండు సిగరెట్లు ఖర్చై వుండడం గమనించిన ఎన్టీఆర్ కు కోపమొచ్చి కేకలేశారట. బాయ్ వచ్చి డూండీ గారితో “సార్ హీరో గారు ఫైర్ అవుతున్నారు అని చెప్పారు. అప్పుడు.. నువ్వు వెళ్లి చెప్పు నిర్మాతగారు ఒకటి, రైటర్ గారు మరొకటి కాల్చుకున్నారని అని డూండీ బాయ్ తో చెప్పి పంపారట.
కానీ ఆ బాయ్ వెంటనే వచ్చాడు.. ఫుల్ టిన్ పంపితేగాని సెట్ కి హీరో గారు రానన్నారండి అని చెప్పాడు. డూండీ తెల్లబోయి, తేరుకొని, ప్రొడక్షన్ అసిస్టెంట్ చిట్టిబాబు ను పిలిచి, కారెక్కి టి.నగర్ లోని ఆంద్రా కిళ్ళీ షాపుకెళ్ళి సిగరెట్ టిన్ తీసుకురమ్మన్నారట. తీరా ఆక్కడకు వెళ్తే, స్టాక్ లేదని చెప్పారట. అక్కడినుంచి ఆరు మైళ్ళ అవతల ప్యారిస్ కార్నర్ లోని కాశిచెట్టి వీధిలోకి వెళ్లి స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్ డబ్బా కొని తెచ్చారట. అప్పుడుగానీ ఎన్టీఆర్ సెట్లోకి అడుగు పెట్టలేదట. డూండీ తోబాటు రమణ కూడా ఎన్టీఆర్ కు సారీ చెప్పారట. అప్పడు ఎన్టీఆర్.. సిగరెట్ కోసం కాదు బ్రదర్! డిసిప్లిన్.. ఆ ప్రిన్సిపుల్ కు నేను కూడా అతీతుణ్ణి కానని చెప్పారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి