
సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ నాలుగో రోజుకే క్రాష్ అయింది, డాకు మహారాజ్ పండగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయింది, హిట్ 3- ది థర్డ్ కేస్ పూర్తి రన్ ఇవ్వక ముందే ఆగిపోయింది. ఈ పరిస్థితులన్నిటికీ ఒకే కారణం పది రోజుల పాటు పెంచిన టికెట్ రేట్లు అలాగే కొనసాగించడం. ప్రేక్షకులు సినిమా బాగుంటే ఎంత ధర అయినా చెల్లించేందుకు సిద్ధంగానే ఉంటారు. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి పక్కా బ్లాక్‌బస్టర్లకు ఇది ఎలాంటి ఇబ్బంది కలిగించదు. వంద, నూట యాభై రూపాయల అదనపు ధర కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ యావరేజ్ సినిమాలు లేదా ఫ్లాప్ సినిమాలకు మాత్రం ఈ విధానం భారీ నష్టాలను మిగులుస్తోంది.
వాస్తవానికి, నాలుగో రోజు నుంచే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వెంటనే మేల్కొని సోమవారం నుంచి టికెట్ ధరలను సాధారణ స్థాయికి తగ్గించాల్సి ఉంది. వారు కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే తగ్గించి, మిగిలిన చోట్ల అలాగే వదిలేస్తున్నారు. దీంతో ప్రజలు థియేటర్లకు రాకుండా, “ఇంకా పది రోజుల్లోనే ఓటిటిలో వస్తుంది కదా, ఇంకేం చూడాలి? ” అని సినిమాలు చూడకుండా లైట్ తీస్కొంటున్నారు. ఇకనైనా ప్రతి సినిమాకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతే యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలకు పెద్ద నష్టం కలిగించే పరిస్థితి తప్పదు.