టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్‌.ఎస్. థమన్ ఒకరు. ఆయన సంగీతం అంటే ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన ‘ఓజీ’ (OG - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాతో థమన్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ చేరింది. యూనివర్సల్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో  భాగంగా థమన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఒకానొక సందర్భంలో తాను పడిన బాధను, మహేష్ బాబు అభిమానుల నుండి ఎదుర్కొన్న తీవ్రమైన విమర్శలను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక సినిమా విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ తనను నానా మాటలు అన్నారని థమన్ తెలిపారు. "నేనేం తప్పు చేశాను? మహేష్ బాబు గారికి నేనేం బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను?" అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో తాను ఏ తప్పు చేయలేదని, కానీ అభిమానుల విమర్శలు, నెగెటివ్ కామెంట్లు తట్టుకోలేక డార్క్ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడ్చానని థమన్ అన్నారు. "సినిమా బాగోకపోతే మ్యూజిక్ డైరెక్టర్‌గా మనమేం చేయగలం? ఈ విషయాన్ని అభిమానులు ఎందుకు అర్థం చేసుకోరో అనిపించింది" అని ఆయన కామెంట్స్ చేశారు. కష్టపడి చేసిన పనికి ఇలాంటి మాటలు పడాల్సి రావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు.

తాను పడుతున్న ఈ మానసిక వేదనను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే అర్థం చేసుకున్నారని థమన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ కష్టకాలంలో తనకు ధైర్యాన్ని ఇచ్చి, సరైన సలహా ఇచ్చింది త్రివిక్రమేనని ఆయన తెలిపారు. "సుమారు ఆరు నెలల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండమని త్రివిక్రమ్ గారు నాకు చెప్పారు. ఆ నెగెటివ్ కామెంట్లు ఏమీ చూడొద్దని, వాటికి స్పందించవద్దని సలహా ఇచ్చారు" అని థమన్ గుర్తుచేసుకున్నారు. త్రివిక్రమ్ ఇచ్చిన ఆ సలహా తనను ఆ బాధ నుండి బయటపడేలా చేసిందని థమన్ వివరించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ, ఇండస్ట్రీలో ఎదురయ్యే విమర్శలు, ఒత్తిడి తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన మాటల్లో స్పష్టమైంది.  ఓజీ వంటి బిగ్గెస్ట్ హిట్‌తో మళ్ళీ తన సత్తా ఏంటో థమన్ నిరూపించుకున్నారు. ఈ సినిమా థమన్ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.








మరింత సమాచారం తెలుసుకోండి: