
ఈ కేసు రాజకీయ రంగు పులుముకోవడానికి ప్రధాన కారణం, దీనికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీలో లభించిన ప్రాధాన్యత. 2024 ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందుబాటులో ఉన్నప్పటికీ, తంబళ్లపల్లె టికెట్‌ను జయచంద్రారెడ్డికి కేటాయించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నకిలీ మద్యం కుంభకోణంతో ముడిపడిన ఆరోపణలున్న జయచంద్రారెడ్డికి టికెట్ దక్కడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది.
జయచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో సైతం తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆ 'ఆఫ్రికా మోడల్' నకిలీ మద్యం డీల్ కారణంగానే అతనికి టీడీపీ టికెట్ దక్కిందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం సరఫరా, పంపిణీకి సంబంధించిన కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇప్పటివరకు జయచంద్రారెడ్డిపై తూతూ మంత్రం సస్పెన్షన్ తప్ప అరెస్టు ఎందుకు చేయలేదనే ప్రశ్నలు అధికార వర్గాలపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.
నకిలీ మద్యం కుంభకోణం ద్వారా రానున్న ఐదు సంవత్సరాలలో దాదాపు 45 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఈ భారీ కుట్ర జరిగిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కీలక నిందితులకు, రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాలపై విచారణ జరిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.