భారతీయ సినీ పరిశ్రమలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజాలకు... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, తెలుగు నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది! ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి – 2025) వేడుకల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ఇద్దరు లెజెండ్రీ నటులు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, వారిని ఘనంగా సన్మానించబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తాజాగా ప్రకటించడం సినీ అభిమానులను ఉప్పొంగిస్తోంది!
 

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎల్‌. మురుగన్‌ ఈ శుభవార్తను వెల్లడించారు. "సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్‌ గారిని, బాలకృష్ణ గారిని సన్మానించబోతున్నాం. వారిద్దరి సినీ ప్రయాణం భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. దశాబ్దాలుగా వారు చేసిన అద్భుతమైన కృషికి, వారి నిబద్ధతకు గుర్తింపుగా.. ఇఫి ముగింపు వేడుకల్లో వారిని గౌరవించుకోబోతున్నాం" అని ఆయన చెప్పుకొచ్చారు. సినీ రంగం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా' (ఇఫి) వేడుకలు నవంబర్‌ 20 నుంచి 28 వరకూ గోవా వేదికగా జరగనున్నాయి.

 

ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాలతో పాటు, భారతీయ సినిమా ఖ్యాతిని పెంచే ఈ మెగా వేదికపై.. రెండు రాష్ట్రాల మాస్ హీరోలు ఒకేసారి సన్మానం అందుకోబోతుండటం అభిమానులకు పండుగే!రజనీకాంత్‌ తన స్టైల్‌, స్వాగ్‌తో దశాబ్దాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలుతుంటే.. నటసింహం బాలకృష్ణ తన పౌరుషం, డైలాగ్‌ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. కోట్లాది మంది అభిమానులు తమ దేవుళ్లుగా భావించే ఈ ఇద్దరు మహానటులకు, కేంద్ర ప్రభుత్వం తరఫున 'ఇఫి' లాంటి వేదికపై సన్మానం దక్కడం.. వారి సినీ చరిత్రకు దక్కిన అత్యున్నత సముచిత గౌరవం! నవంబర్ 28న జరిగే ముగింపు వేడుకల్లో ఈ ఇద్దరు దిగ్గజాలను సన్మానించే అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: