ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చర్చనీయాంశమైన పేరు ఐబొమ్మ రవి. టెక్నాలజీపై అతనికి ఉన్న పట్టుతో సినిమాలను పైరసీ చేసి, సినీ పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘనుడిగా ఇతను పేరు పొందారు. ఈ వ్యవహారంపై పెద్దఎత్తున దుమారం రేగడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ తర్వాత రవికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసులు అతనికి ఏకంగా ఉద్యోగ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. టెక్నాలజీలో అతనికున్న నైపుణ్యాన్ని గుర్తించిన పోలీస్ శాఖ, అతన్ని తమ సైబర్ క్రైమ్ విభాగంలో చేర్చుకోవడానికి సిద్ధమైందని, మంచి జీతం కూడా ఆఫర్ చేశారని సమాచారం. అయితే, అనూహ్యంగా ఐబొమ్మ రవి ఈ ఆఫర్‌ను తిరస్కరించారు.
తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి వెల్లడిస్తూ... రవి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో తాను కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ రెస్టారెంట్‌లో తెలుగు రాష్ట్రాల వంటకాలతో పాటు, దేశంలోని వివిధ రకాల వంటకాలను రుచి చూపిస్తానని చెప్పారని భోగట్టా. అంతేకాదు, ఆ రెస్టారెంట్‌కు సైతం తాను బాగా పాపులర్ అయిన 'ఐబొమ్మ' పేరునే పెడతానని రవి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి.
ఇక, పైరసీ ద్వారా తాను సంపాదించిన సొమ్ము వివరాలను కూడా రవి బయటపెట్టారు. తాను మొత్తం 20 కోట్ల రూపాయలు సంపాదించగా, అందులో ఏకంగా 17 కోట్ల రూపాయలను కేవలం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం రవి ఆస్తులతో పాటు, బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను పోలీసులు సీజ్ చేశారు. అయితే, ప్రస్తుతం జైలులో ఉన్న ఐబొమ్మ రవికి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఐబొమ్మ రవి గురించి ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి