హైదరాబాదీ భామ.. బాలీవుడ్‌ను ఒక దశలో ఒక ఊపు ఊపిన సెక్సీ అందాల భామ.. ఇప్పుడు సీనియారిటీ పెరిగిపోయి.. తనకు వస్తున్న ఆఫర్లనుంచి ఆచితూచి మాత్రమే ఎంచుకుంటోంది. తెలుగులోనూ తనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ.. ఇక్కడి చిత్రాలను చేయడం పూర్తిగా తగ్గించుకుంది. అయితే ఇప్పటికీ తన కెరీర్ గురించి తనకు ఇంకా అసంతృప్తిగానే ఉన్నదని.. అందరూ మూసకథలతోనే తన వద్దకు వస్తున్నారు తప్ప.. కొత్తగా చూపించే ప్రయత్నం జరగడం లేదని అంటోంది. ఈ భామ టబు.. కూలీనెంబర్ 1 నుంచి తెలుగువారికి బాగా తెలిసిన అందగత్తె.
ఇటీవలికాలంలో.. లైఫ్ ఆఫ్ పై వంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి కూడా సంపాదించుకున్న టబు వద్దకు అందరూ సీరియస్ కేరక్టరైజేషన్ ఉన్న కథాంశాలతోనే వెళుతున్నారుట. అదే ఇదివరలో అయితే అన్నీ గ్లామర్ పాత్రలే వచ్చేవిట. క్రమంగా అభినయం విషయంలో చాలా మంది హీరోయిన్లకంటె టబు బాగా అందుకుంటుందని.. ఆమె పెర్ఫార్మెన్స్ పరిపూర్ణంగా ఉంటుందని పేరు రావడంతో.. ఆమెకు అందరూ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే ఇవ్వడం ప్రారంభించారు. మళ్లీ అది కూడా మూసగా మారిపోయింది.
ఇప్పుడు అలాంటి ఆఫర్లు కూడా రిజెక్ట్ చేస్తున్నట్లు టబు అంటోంది. కొత్తగా సినిమాలు వస్తే చేయాలని ఉన్నట్లు చెబుతోంది. పాత్ర కొత్తగా ఉంటే.. ఏ భాషలోనైనా చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది. తాజాగా మళయాళ దృశ్యం చిత్రానికి హిందీ రీమేక్‌లో టబు ఓ పాత్ర పోషించింది. అది మరో రెండురోజుల్లో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభవాల్ని పంచుకున్న టబు.. వెరైటీ పాత్రలు రావడం లేదనే అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోవడం విశేషం.