అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. ముఖ్యంగా వివేక్ రామ స్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ తమ ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్ కు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామ స్వామి ట్రంప్ తో అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు.


ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడి నేతల మధ్య దూషణల పర్వం పతాక స్థాయికి చేరుకుంటుంది. ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు నేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ నేతల మధ్య ఇటీవల జరిగిన మూడో చర్చ కార్యక్రమం రసాభాసగా మారింది. తొలి డిబేట్ లో అమెరికా ప్రజల దృష్టిని ఆకర్షించిన వివేక్ రామస్వామి ఆ రత్వాత వెనుక బడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ క్రమంలో దూకుడు పెంచిన వివేక్ రామస్వామిపై నిక్కీ హేలీ విరుచుకుపడ్డారు. నువ్వో చెత్త అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.


ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో చైనా యాప్ టిక్ టాక్ ప్రధాన ఎజెండాగా మారింది. వివేక్ రామస్వామి అధికారంలోకి వస్తే చైనా దిగుమతులపై ఆంక్షలు విధిస్తానని చెప్పారు. తద్వారా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకువచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా ముందు మీరు చైనా యాప్ టిక్ టాక్ వాడటం మానేయండి అంటూ నిక్కీ హేలీ రామస్వామికి చురకలంటించారు.


దీనికి బదులుగా ఆయన మీ కుమార్తె కూడా టిక్ టాక్ వాడుతుందని చెప్పుకొచ్చారు. ముందు మీ ఇంట్లో వాళ్లను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. దీంతో కోపోద్రిక్తురాలైన నిక్కీ ఇందులోకి తన కుటుంబాన్ని లాగొద్దంటూ హెచ్చరించారు. నువ్వో చెత్త అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.  వాస్తవానికి ఆయన ఉద్దేశం కుటుంబాన్ని లాగడం కాకపోయినా.. మీ కూతురు వాడుతోంది అనే ఉద్దేశంలో వ్యాఖ్యానించారు. దీంతో ఆమె రామస్వామి మాటలు వక్రీకరించి ఇందులోకి మా కుటుంబాన్ని లాగుతావా అంటూ అంశాన్ని పక్కదోవ పట్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: