గతేడాది కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కలిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి కర్నాటక రాజకీయం రంజుగా మారింది. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి మరోసారి ఉమ్మడిగా బరిలోకి దిగుతుండగా బీజేపీ మరోసారి తన ప్రాభవం చాటుకునేందుకు ట్రై చేస్తోంది. చేతికందినట్టే అంది చేజారిపోయిన పీఠాన్ని లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి ఆ తర్వాత కైవసం చేసుకునేలా వ్యూహరచన చేస్తోంది.

కర్నాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు ఆ కూటమికి రెఫరెండం అని చెప్పొచ్చు. మిత్రపక్షాలైన కాంగ్రెస్- జేడీఎస్మరోసారి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం సింగిల్ గా బరిలోకి దిగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కాయి. అయితే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడింది. తక్కువ సీట్లున్న జేడీఎస్ కు సీఎం కుర్చీ ఇచ్చి పాలన సాగిస్తోంది.

కర్నాటకలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో దక్షిణ కర్నాటక, పాత మైసూరు ప్రాంతంలోని 14 స్థానాలకు  పోలింగ్జరగనుంది. అత్యధిక స్థానాల్లో ముఖాముఖి పోటీ నెలకొంది. కోలారు మొదలుకుని శివమొగ్గ వరకు, ఉడిపి నుంచి చామరాజనగర వరకు వ్యాపించి ఉన్న దక్షిణాది జిల్లాల్లో పార్టీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, బెంగళూరు రూరల్, చామరాజనగర జిల్లా స్థానాలను గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బెంగళూరు సిటీ, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, మైసూరు, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. మండ్య, హసన్స్థానాలు జేడీఎస్ కు వెళ్లాయి. ఇప్పుడు బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ఉమ్మడిగా అభ్యర్థులను దించాయి.

అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నా అధికారం మాత్రం బీజేపీకి దక్కలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠమెక్కి బలం నిరూపించుకోలేక తప్పుకోవాల్సి వచ్చింది. ఇది బీజేపీలో కసిని రగిలిస్తోంది. ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనుకుంటోంది. అదే జరిగితే దేశంలో మోదీ మరోసారి గద్దెనెక్కుతారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు లాక్కొని అధికారం కైవసం చేసుకోవాలనేది ఆ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇందుకోసం అన్ని వ్యూహాలూ రచిస్తోంది. అధికారపార్టీలకు చెందిన వారిపై ఐటీ దాడులు చేస్తోంది. వీటిని ఎదుర్కొంటూనే తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు శక్తికి మించి కష్టపడాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: