కొన్నాళ్లు కేసులు, వివాదాలతో కొంచెం నెమ్మదించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇటీవల మళ్లీ స్పీడు పెంచారు. మరోపక్క, కొఠారి అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదనే విమర్శ ఎదుర్కొంటున్నారు. పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టి సొంత కోటరీని తయారు చేసుకుంటున్నారని నియోజకవర్గంలోని వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా రోజు రోజుకు నియోజకవర్గ వైసీపీలో ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ సీనియర్లను పక్కన పెడుతుండటంతో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనే తిరుగుబావుటా ఎగరు వేస్తున్నారు నియోజకవర్గం నాయకులు.

సొంత పార్టీలో ఇబ్బందులకు తోడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దీంతో చింతమనేని జోరును నిలువరించేందుకు స్థానిక వైసీపీ నాయకులను రంగంలోకి దింపుతున్నారు అబ్బయ్య చౌదరి. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి ప్లెక్సీలు ఏర్పాటు చేయించారు. వాటిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫొటో వేయకపోవడంతో పెద్ద దుమారమే రేగింది.

వైసీపీ అంటే సీఎం జగన్ అని, ఎమ్మెల్యే కాదని కరాఖండీగా నరసింహమూర్తి చెప్పేశారు. నరసింహమూర్తి ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయినా నియోజకవర్గ వైసీపీలో ఉన్న రెండు వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. మరోపక్క మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, రోడ్లు అధ్వాన్నంగా మారాయంటూ తన సొంత ఖర్చులతో రోడ్ల మరమ్మతులు చేయించడం ప్రారంభించారు. దీంతో వైసీపీ కింది స్థాయి నాయకులు చింతమనేనిపై, టీడీపీ నాయకులపై ఎదురు దాడికి దిగారు.


చింతమనేని చేయిస్తున్న రోడ్ల మరమ్మతు పనులను అడ్డుకున్నారు. ఇక్కడ కూడా పోలీసులు రంగప్రవేశం చేయక తప్పలేదు. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య గొడవ చివరకు ఒకరిపై మరొకరు దాడి చేసే వరకు వెళ్లింది. అప్పటి నుంచి సొంత పార్టీలో ఓ వర్గంతో పాటు ప్రతిపక్ష పార్టీతో ఎమ్మెల్యే కొఠారికి చిక్కులు మొదలయ్యాయి. ప్రతిపక్ష నాయకుడు చింతమనేనిని పోలీసు కేసులతో నియంత్రించగలిగినా, సొంత పార్టీలోని వర్గ పోరును మాత్రం అబ్బయ్య చౌదరి నియంత్రించలేక ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం కలుగజేసుకుంటే ముందుగా సొంత పార్టీలో వ్యతిరేకతను అడ్డుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: