గుంటూరు జిల్లా నరసారావుపేట అంటే కోడెల శివప్రసాద్ అడ్డా అని రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. వరుసపెట్టి అయిదుసార్లు కోడెల నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక నరసారావుపేట తర్వాత కోడెల, సత్తెనపల్లిలో కూడా సత్తా చాటారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు నుంచి విజయం సాధించి, నవ్యాంధ్ర అసెంబ్లీకు మొదటి స్పీకర్‌గా పనిచేశారు. ఇక ఆ ఐదేళ్లలో కోడెల జీవితంలో చెరగని మచ్చలు పడిపోయాయి. టి‌డి‌పి అధికారంలో ఉండటంతో కోడెల కుమారుడు, కుమార్తెలు అక్రమాలకు లెక్కలేకుండా పోయిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

ముఖ్యంగా కోడెల తనయుడు శివరాం...పెద్ద ఎత్తున నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దందాలు చేశారని, కె ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల ఫలితంగానే 2019 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లిలో ఓటమి పాలయ్యారు. అటు నరసారావుపేట నియోజకవర్గంలో కూడా టి‌డి‌పి ఓటమి పాలైంది. అయితే ఓడిపోయాక కోడెలని వైసీపీ ప్రభుత్వం గట్టిగానే టార్గెట్ చేస్తూ వచ్చింది. ఒక వైపు కుమారుడు అక్రమాలు, మరోవైపు అసెంబ్లీ సామాగ్రిని సొంతానికి వాడుకున్నారని వైసీపీ నేతలు మాటల దాడి చేశారు.

ఈ క్రమంలోనే అవమానాలు తట్టుకోలేని కోడెల ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఇక కోడెల తర్వాత సత్తెనపల్లి బాధ్యతలు శివరాంకు అప్పగించారు. కానీ అక్కడ కొందరు టి‌డి‌పి కార్యకర్తలకు శివరాంకు బాధ్యతలు అప్పగించడం ఏ మాత్రం ఇష్టం లేదు.

ఇప్పటివరకు కొన్ని రోజులు ఓపిక పట్టిన ఆ కార్యకర్తలు శివరాంపై ఎదురుదాడికి దిగారు. శివరాం అక్రమాలు వల్లే గత ఎన్నికల్లో సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆయన వల్ల ఇంకా పార్టీ నష్టపోతుందని మాట్లాడుతున్నారు. అంటే టి‌డి‌పి కార్యకర్తలకు శివరాంపై ఇంకా నమ్మకం కుదిరినట్లు కనిపించడం లేదు. ఎన్నికల వరకు ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల సీన్ రిపీట్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: