ఏపీలో ఎదురు లేకుండా ఉన్న వైసీపీకి ఇప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అనేక సమస్యలపై గగ్గోలు పెడుతుండగా ఇప్పుడు వాటికి తోడు, కేంద్రం కూడా జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలే ఇఁదుకు నిదర్శనం. కొద్దిరోజుల క్రితం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం వైసీపీకి వ్యతిరేకంగా నిలిచింది. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

రాజ్యసభ సాక్షిగా ఏపీ పరువు తీశారు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్. అసలు ఏపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా పోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టుగా ఉచిత పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. దీని కారణంగా ఏపీలో రెవెన్యూ లోటు ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పారు. అమ్మఒడి, ఉచిత విద్యుత్, వాహన మిత్ర, జగనన్న చేయూత అంటూ ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు చేయడం కారణంగానే లోటు పెరిగిందని తేల్చేశారు. కాగ్ నివేదిక కూడా ఇదే స్పష్టం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు మాత్రం ఇంకా స్పందించలేదు.

మరోవైపు పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వైసీపీని టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్వహణ చేత కావడం లేదంటూ ఆమధ్య బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో అగ్గి రాజేశాయి. అయితే అప్పుడు మాత్రం ఆయన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు కావాలనే వైసీపీని టార్గెట్ చేశారని కవర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీతో బీజేపీ డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అమరావతి రాజధాని రైతులకు మద్దతు ఇవ్వడం వంటి విషయాలు కూడా వైసీపీకి తలనొప్పిగా మారాయి. అయితే వైసీపీ నేతలు.. తెలంగాణా ప్రభుత్వంలా కేంద్రానికి ఎదురెళ్తారా.. లేక సానుకూలంగా సమస్యలను పరిష్కరించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: