ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి కలిపి ఎన్నికలు జరిగే అవకాశమే లేకుండా పోయింది. ఏపీలో ఐదేళ్లకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో మాత్రం ముందస్తు ఎన్నికల శంఖారావం మోగింది. ముందే అసెంబ్లీని రద్దు చేసి 2018లో ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఇప్పుడు మరోసారి ఆయన ఆ సాహసానికి ఒడిగడుతున్నారనేది కాంగ్రెస్ వాదన. దానికి సాక్ష్యాధారాలు కూడా చూపిస్తున్నారు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ఆయన జోస్యం చెబుతున్నారు.

ఇటీవల కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతోంది తెలంగాణ సర్కారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఓ రేంజ్ లో ఫైట్ జరిగింది. గవర్నర్ విషయంలో కూడా ఏదో జరుగుతోందనే అనుమానం మొదలైంది. దీంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని కచ్చితంగా చెబుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కర్నాటకతోపాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలొస్తాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరతామన్నారాయన. తెలంగాణలో ఇప్పుడున్న యంత్రాంగంతో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతారనే నమ్మకం తమకు లేదన్నారు. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసి, ఆ తర్వాత ఎన్నికలు జరపాలని కోరతామన్నారు ఉత్తమ్.

గవర్నర్‌ వ్యవస్థను ఎవరైనా గౌరవించాల్సిందేనని, పార్టీలకతీతంగా గవర్నర్ ని గౌరవించడం ఆనవాయితీ అని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గవర్నర్ వ్యవస్థను అవమాన పరుస్తోందని చెప్పారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎంపికైన నియోజకవర్గాల్లో అధికార యంత్రాంగం ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్నప్పటికీ అధికారులు తనకు సరైన రీతిలో ఆహ్వానాలు పంపరని, తన కార్యక్రమాలపై సక్రమంగా స్పందించరని చెప్పారు ఉత్తమ్. తెలంగాణలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రోటోకాల్‌ విషయంలో తమకు జరుగుతున్న అవమానాలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు తాము కంప్లయింట్ చేశామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారాయన. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారని, అయితే ఈసారి కేసీఆర్ కి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: