
గుడివాడలో తనను ఓడించాలంటే తుప్పు నాయుడు, పప్పునాయుడు వచ్చినా కుదరదని చెప్పారు నాని. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటోందని, ఎమ్మెల్యేగా తాను అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నానని అన్నారు. చంద్రబాబు ఇలా వచ్చి అలా వెళ్లేవారని, గుడివాడ ప్రజలు ఆయన్ను పిచ్చి కుక్కలా చూస్తున్నారని చెప్పారు నాని. కుప్పంలో గెలిచే దిక్కులేని చంద్రబాబు.. ఇప్పుడు గుడివాడ రావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు నాని. డబ్బులు ఉన్నాయి కదా అని గుడివాడ వస్తే కుక్కకాటుకి చెప్పుదెబ్బలా ప్రజలు రాబోయే ఎన్నికల్లో మళ్లీ బాబుని ఓడిస్తారని హెచ్చరించారు.
ఎంత మంది దిగొచ్చినా గుడివాడలో కొడాలిని ఏం చేయలేరని చెప్పారు నాని. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఆయనపై అభిమానం ఉన్నవారిని కాదనే అధికారం ఎవరికీ లేదన్నారు నాని. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని, ఆయన విగ్రహానికి ఏ రంగులైనా వేసుకోవచ్చని అన్నారు. తాము ప్లీనరీ పెట్టుకున్నామని, అందుకే హోర్డింగ్ లు పెట్టామని అన్నారు నాని. చంద్రబాబు వస్తున్నాడని తాము పబ్లిసిటీ ఇవ్వడంలేదని చెప్పారు. ఎన్టీఆర్ జనం మనిషి అని, ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేయొచ్చని వివరణ ఇచ్చారు. అసలు ఆ మాటకొస్తే ఎన్టీఆర్ కి టీడీపీకి సంబంధం లేదన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి లెటర్ తీసుకొచ్చి టీడీపీ నుంచి ఎన్టీఆర్ ని బహిష్కరించారని, ఇంకా ఎన్టీఆర్ కి టీడీపీ సంబంధం ఏముందని అన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పి మళ్లీ రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని, ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని చెప్పారు నాని.