ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, జగన్ పై చేస్తున్న విమర్శలు.. జనవాణి అనే కార్యక్రమాలు పెట్టి జనం వద్ద సమస్యలు వినడం, కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆటోమేటిక్ గా పవన్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఓ దశలో అసలు చంద్రబాబుని కూడా పట్టించుకోకుండా కేవలం పవన్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

ధనసేన.. ధనవాణి..
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఇద్దరూ పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంపై వెల్లంపల్లి సెటైర్లు వేశారు. ఆ కార్యక్రమానికి ధనవాణి అని పేరుపెట్టుకోవాలన్నారు. ఇక జనసేన కూడా పేరు మార్చుకోవాలని దానికి ధన సేన అనే పేరు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కల్యాణ్ ఓ ఆప్షనల్ పొలిటీషియన్ అని ఆయన్ను అసలు రాజకీయ నాయకుడు అని కూడా అనలేమని చెప్పారు అమర్నాథ్.

జనసేన పార్టీ పెట్టి 8 ఏళ్లయిందని, ఎనిమిదేళ్లలో ఆయన ఎనిమిది పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా పొత్తులు పెట్టుకోలేదని చెప్పారు. ఆప్షన్లు ఇస్తూ హడావిడి చేసే పవన్ ఆప్షనల్ పొలిటీషియన్ అని, ఆయన పార్టీ ఆప్షనల్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్, చంద్రబాబుని ఎప్పుడూ ప్రశ్నించలేదని, ఇప్పుడు కేవలం జగన్ పై ఉన్న అక్కసుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు అమర్నాథ్. పవన్ కల్యాణ్ ఆప్షన్లు ఇవ్వకుండా వేలం పాటలో పాల్గొంటే బెటర్ అని అన్నారు గుడివాడ అమర్నాథ్. పవన్ పై వైసీపీ నేతలు చేస్తున్నవిమర్శలపై జనసైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్షాన్ని వదిలేసి, పవన్ పై పడుతున్నారని, పవన్ అంటే వైసీపీ వారికి భయం ఏర్పడిందని అంటున్నారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు మంచి స్పందన వచ్చిందని, అందుకే అధికార పార్టీ జనసేనను టార్గెట్ చేసిందని చెబుతున్నారు. జనవాణి కార్యక్రమానికి కూడా మంచి స్పందన వచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: