క్లౌడ్ బరస్ట్.. ఈ పదం నిన్న బాగా హైలెట్ అయింది. తెలంగాణలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అనే పదం వాడతారని, ఆ వరదలకు విదేశీ కుట్ర కారణం అని అంటారని ఎవరూ ఊహించలేదు. కనీసం టీఆర్ఎస్ నాయకులు కూడా ఊహించి ఉండరు. కేసీఆర్ అన్న తర్వాతే అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అని అందరూ డిక్షనరీలు తీశారు. అసలు అర్థం ఇదీ అంటూ వార్తలిచ్చారు. అయితే నిజంగా క్లౌడ్ బరస్ట్ మానవ ప్రయత్నంగా జరిగే అవకాశముందా, అది కూడా విదేశీ శక్తులు మన దేశంపై క్లౌడ్ బరస్ట్ ని ప్రయోగించ వచ్చా. అలాంటప్పుడు అసలు యుద్ధాలెందుకు వెంటనే క్లౌడ్ బరస్ట్ లు చేసేస్తే శతృ దేశాలన్నీ వరదల్లో మట్టికొట్టుకుపోతాయి కదా. మరి కేసీఆర్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు, దీని వెనక ఆంతర్యమేంటి..?

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యల్ని ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ గా అభివర్ణించారు బండి సంజయ్. సీఎం వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలుగుతుందని అనుకున్నామని, కానీ ఆయన అక్కడకు వెళ్లి జోకర్ లా మాట్లాడారని మండిపడ్డారు బండి. గోదావరికి గతంలో కూడా చాలాసార్లు వరదలు వచ్చాయని, కానీ ఈసారి వచ్చిన వరదలు భారీగా ఉన్నాయని, ఇప్పుడు వచ్చిన వరదలు మరోసారి రావని కూడా చెప్పలేమని అన్నారు సంజయ్. కానీ కేసీఆర్ మాత్రం వరదలు మానవ సృష్టిలా కన్పిస్తున్నాయని, అది విదేశాల కుట్ర అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. కొత్తగా విదేశీ కుట్ర అనే డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు తాను పెద్ద ఇంజినీరింగ్‌ నిపుణుడిగా గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌ రీడిజైన్‌ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ వర్షాలకు మునిగిపోయిందని, దాని నష్టం ఎవరు భర్తీ చేస్తారని, ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు.

అటు కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ అర్జంట్ గా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కి సమాచారం ఇవ్వాలన్నారు. కుట్రకోణం ఉందని చెప్పిన కేసీఆర్ దానికి కారణం ఎవరో కూడా చెప్పాలన్నారు. ఇంత పెద్ద విదేశీ కుట్రను బహిర్గతం చేసిన ఆయన, దీని వెనక ఉన్నవారెవరో చెప్పకపోవడం దారుణం అని, వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్ ని ఎంక్వయిరీ చేయాలని కోరారు. మొత్తానికి క్లౌడ్ బరస్ట్ పేరుతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. సహజంగా ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేస్తే.. శతృ దేశాల కుట్ర అంటూ ఈపాటికే ఓ రేంజ్ లో కామెంట్లు వచ్చేవి, కానీ కేసీఆర్ ఈ మాటలు అన్నారు కాబట్టి..  వీటిని జోక్ లు గా అభివర్ణిస్తున్నారు బీజేపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: