
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్టీనుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోపు మరో పార్టీలోకి జంప్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన తాజా కామెంట్లు సంచలనంగా మారాయి. పార్టీలు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని అన్నారు చంటిబాబు. గాడిద గుడ్డు పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. మేం ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా.. అని ప్రశ్నించారు చంటిబాబు. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం కాదని, ఈ పార్టీలో ఇవాళ ఉన్నవారు, రేపు మరో పార్టీలో ఉంటారని చెప్పారు. రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసన్నారు.
సీఎం జగన్ పై కూడా ఎమ్మెల్యే చంటిబాబు సెటైర్లు వేసినట్ుట చెబుతున్నారు. పింఛన్ తీసుకునే సామాన్యుడు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టగలడా? అని అన్నారట చంటిబాబు. ఇటీవల పార్టీ ప్లీనరీ నుంచి ఆయన మారిపోయారని చెబుతున్నారు సన్నిహితులు ప్లీనరీ తర్వాత ఓసారి జగన్ తో భేటీ జరిగిందని, అప్పటికే ఆయనకు ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. పైగా ఈమధ్య పీకే టీమ్ సీఎం జగన్ కి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ వస్తోంది. వీరిలో పూర్ పర్ఫామెన్స్ ఉన్నవారందరికీ జగన్ క్లాస్ తీసుకుంటున్నారట. అందుకే వారికి పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారట. ఈ ఇబ్బంది వల్ల కొంతమంది పార్టీకి దూరం జరుగుతున్నారని అంటున్నారు. అలాంటి వారందరూ ముందే పార్టీనుంచి వెళ్లిపోవడం మంచిదని జగన్ కూడా అనుకుంటున్నారట. సో.. త్వరలోనే వైసీపీలో హడావిడి మొదలవుతుందని అంటున్నారు విశ్లేషకులు. జ్యోతుల చంటిబాబు లాంటి వారు ఇంకెంతమంది ఉంటారో చూడాలి.