జనసేన అధినేత పవన్ కల్యాన్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎలాగుంటాయంటే జగన్మోహన్ రెడ్డికన్నా తాను చాలా పెద్ద లీడర్ని అని. ఇక్కడ జగన్ పేరెందుకు ప్రస్తావించాల్సొచ్చిందంటే పవన్ టార్గెట్టు మొత్తం జగనే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానని చాలెంజ్ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానన్నారు. వైసీపీని ఓడించటం ఖాయమని చాలా గట్టిగా చెప్పారు.





నిజానికి పవన్ కు అర్ధమవ్వాల్సింది ఏమిటంటే వైసీపీని ఓడించటం, జగన్ను ముఖ్యమంత్రిని కానీయకుండా అడ్డుకోవటంకాదు. జనసేనను ఎలా గెలిపించుకోవాలి ? తాను ఎక్కడినుండి పోటీచేసి గెలవాలన్న విషయాన్నే పవన్ ఆలోచించుకోవాలి. జనసేనను గెలిపించుకోవాలని, తాను కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదల రానంతవరకు జగన్ను పవన్ చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జగన్ను సీఎం చేసిందీ జనాలే, పవన్ను రెండుచోట్లా ఓడిగొట్టిందీ జనాలే.





మరో ఏడాదిన్నరలో షెడ్యూల్ ఎన్నికలు వచ్చేస్తుంటే ఇప్పటివరకు తాను ఎక్కడినుండి పోటీచేయబోతున్నాననే విషయాన్నే పవన్ బహిరంగంగా ప్రకటించలేదు. పార్టీ అధినేత అయ్యుండి సేప్ నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారంటేనే పవన్ స్ధాయి ఏమిటో అర్ధమైపోతోంది. జగన్ కు పులివెందుల ఉన్నట్లే చంద్రబాబునాయుడుకు కుప్పం నియోజకవర్గముంది. మరి పవన్ కు ఏ నియోజకవర్గం ఉంది ?





ఏరికోరి గెలుపు గ్యారెంటీ విషయంలో అనేక సర్వేలు చేయించుకుని మరీ పోటీచేసిన భీమవరం, గాజువాకల్లోనే పవన్ ఓడిపోయారు. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కు గెలుపు గ్యారెంటీ ఏముంది ? టీడీపీ, జనసేన గనుక విడిగా పోటీచేస్తే వచ్చేఎన్నికల్లో కూడా పవన్ గెలుపు కష్టమనే అంటున్నారు. ఆ విషయం బాగా అర్ధమవ్వబట్టే టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. ఒంటరిగా పోటీచేసి గెలిచే సత్తాలేని పవన్ కూడా జగన్ను చాలెంజ్ చేస్తుండటమే చాలా విచిత్రంగా ఉంది. ముందు ఏదో పద్దతిలో తాను ఎక్కడో ఒక నియోజకవర్గంలో గెలిస్తే జనసేన అధికారంలోకి వచ్చినంత సంతోషం.  



మరింత సమాచారం తెలుసుకోండి: