తెలుగుదేశంపార్టీ భావి అధినేత నారా లోకేష్ కుప్పంలో 11 గంటలకు పాదయాత్రలో మొదటి అడుగు వేశారు. స్ధానిక వరదరాజస్వామి దేవాలయంలో పూజలు చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన బహిరంగసభలో నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. టీడీపీకి పటిష్టమైన యంత్రాంగం ఉండటం, ఎల్లోమీడియా నూరుశాతం మద్దతు లోకేష్ కు బాగా కలిసొస్తుందనే చెప్పాలి.





అంతా బాగానే ఉందికానీ పాదయాత్రలో కీలకమైన పాయింట్ ఏమిటి ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటమే అయితే జనాలు పెద్దగా స్పందించరు. ఎందుకంటే జగన్ పై ఆరోపణలు, విమర్శలు ప్రతిరోజు చేస్తున్నవే. అయితే ఇక్కడే మరో పాయింట్ కూడా ఉంది. జగన్ పాదయాత్రలో తన తండ్రి వైఎస్సార్ పరిపాలనను తీసుకొస్తానని పదేపదే చెప్పారు. తన తండ్రి వైఎస్సార్ రెండు అడుగులు ముందుకేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని జనాలకు హామీఇచ్చారు.





అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమిచేస్తున్నారన్నది పక్కనపెట్టేద్దాం. ఎందుకంటే జగన్ భవిష్యత్తు ఏమిటో 2024 ఎన్నికల్లో జనాలే తేల్చేస్తారు. మరి ఇపుడు పాదయాత్రలో లోకేష్ ఏమి హామీలు ఇవ్వబోతున్నారు ? జగన్ లాగ తన తండ్రి చంద్రబాబు పాలనను జనాలకు గుర్తుచేస్తానని చెప్పగలరా ? చంద్రబాబు గత పాలననే మళ్ళీ తీసుకొస్తానని జనాలకు హామీ ఇవ్వగలరా ? చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు అమలైనట్లే మళ్ళీ అమలుచేస్తామని, అప్పట్లో జరిగిన అభివృద్ధికి మించిన అభివృద్ధిని చేసి చూపిస్తానని జనాలకు హమీఇస్తారా ? అభివృద్ధి, సంక్షేమపథకాల అమలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. అయితే వాటిని ఎలా అమలుచేయబోతున్నారో కూడా చెప్పి జనాలను కన్వీన్స్ చేయగలగాలి.






జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని లోకేష్ గ్రహించాలి.  లోకేష్ హామీలతో కన్వీన్స్ అయితేనే కదా టీడీపీకి ఓట్లేయాలా వద్దా అనేది జనాలు తేల్చుకునేది. ఎలాంటి హామీలు ఇవ్వకుండా, భవిష్యత్తు ప్రణాళికలను వివరించకుండా పాదయాత్ర చేస్తానంటే లోకేష్ శ్రమంతా వృధా అవటం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: