అదునుచూసి వైసీపీని దెబ్బకొట్టడానికి ఉద్యోగసంఘాలు రెడీ అవుతున్నాయా ? ఆర్ధిక డిమాండ్ల సాధనకోసం ఎన్నికల ముందు ఉద్యమ కార్యాచరణను ప్రకటించటమంటే వైసీపీకి డేంజర్ బెల్స్ వినిపించటమేనా ? లేకపోతే జగన్ పైనే మైండ్ గేమ్ మొదలుపెట్టారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెరవెనుక ఏమిజరిగిందనేది పక్కనపెట్టేస్తే ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగసంఘం కార్యాచరణను ప్రకటించింది. అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

ఆయన చెప్పిన ప్రకారం ఉద్యమం మార్చి 9,10 తేదీల్లో మొదలవ్వబోతోంది. రకరకాల రూపాల్లో జరిపే నిరసన మార్చి 24వ తేదీవరకు జరుగుతుంది. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే దాన్ని ఏప్రిల్ నెలలో మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు టైం టేబుల్ ప్రకటించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్చి 16వ తేదీన ఎంఎల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగబోతోంది. మూడు గ్రాడ్యుయేట్లు, 2 టీచర్ల నియోజకవర్గాలకు జరగబోయే ఎన్నికలు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం.


ఈ ఐదు స్ధానాల్లో వైసీపీనే గెలవాలని జగన్ ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలకు కూడా పదేపదే చెప్పారు. స్ధానికసంస్ధల కోటాలోని తొమ్మిది స్ధానాలు ఎలాగూ వైసీపీ ఖాతాలోనే పడటం ఖాయం. ఇదే సమయంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఐదు స్ధానాల్లో ఓట్లు వేయబోయేది గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లే. జీత, బత్యాలు ఆలస్యం అవుతుండటం, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వకపోవటంతో ఉద్యోగులంతా మండుతున్నారు.

అలాగే స్కూళ్ళల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాల్సి రావటం, కచ్చితంగా స్కూళ్ళల్లోనే ఉపాధ్యాయులంతా ఉండి పాఠాలు చెప్పాలని ప్రభుత్వం గట్టిగా పట్టుబడటం లాంటి వాటితో కొందరు టీచర్లకు మండిపోతోంది. ఇలాంటి కారణాల వల్ల ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వంపై బాగా వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఉద్యోగులు సమ్మె కార్యాచరణ ప్రకటించారంటే ఎన్నికల్లో ఓట్లను బూచిగా చూపించి ప్రభుత్వాన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లే అనుమానంగా ఉంది.  మరి చివరకు ఏమవుతుందో చూద్దాం.మరింత సమాచారం తెలుసుకోండి: