కాపుసంక్షేమసేన పేరుతో మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య చాలా ఆయాసపడుతున్నారు. సేన పేరుతో రాష్ట్రమొత్తం సర్వేలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. తమ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని తేలిందని తాజాగా చెప్పారు. జగన్ను ఓడించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఏకం కావాల్సిందే అని పదేపదే గోలచేస్తున్నారు. ఈమధ్యనే సేన ఆధ్వర్యంలో సర్వేచేసినట్లు చెప్పారు. ఆ సర్వేలో బడుగు, బలహీనవర్గాలు జగన్ను ఓడించేందుకు పై మూడుపార్టీలు ఏకం కావాలని కోరుకుంటున్నట్లు తేలిందన్నారు.





ఇక్కడే జోగయ్య సర్వే బోగస్ అని అర్ధమైపోతోంది. ఎందుకంటే జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు ఏకం కావాలని జనాలు కోరుకుంటున్నారంటే నమ్మేట్లుగా లేదు. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలోను, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బడుగు, బలహీనవర్గాలకే అత్యధిక ప్రాధాన్యతిస్తున్నారు. పార్టీ పోస్టుల నియామకంలోను,  స్ధానికసంస్ధల ఎన్నికలు, చట్టసభల్లో కూడా బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళలకు మ్యాగ్జిమమ్ ప్రయారిటీ ఇస్తున్న విషయం అందరు చూస్తున్నదే.





తమకింత ప్రాధాన్యత ఇస్తున్న జగన్ ఓటమిని బడుగు, బలహీనవర్గాల వాళ్ళు కోరుకుంటున్నట్లు జోగయ్య చెప్పటం నమ్మేట్లుగా లేదు. పోనీ అంతకుముందు పై వర్గాలకు చంద్రబాబునాయుడు ఏమన్నా కిరీటం పెట్టారా అంటే అదీలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్ళూ పై వర్గాలను చంద్రబాబు చాలా సందర్భాల్లో  బాగా అవమానించారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోరఓటమి.





వాస్తవం ఇలాగుంటే జోగయ్య మాత్రం జగన్ ఓడిపోవాలన్న తన కోరికను బడుగు, బలహీనవర్గాలపైకి నెట్టేస్తున్నారు. జోగయ్య అజెండా ఏమిటంటే పవన్ కల్యాణ్ సీఎం అవ్వటమే. కానీ ఏ కోణంలో చూసినా అందుకు అవకాశం కనబడటంలేదు. చంద్రబాబుతో పొత్తుంటే పవన్ సీఎం ఎలాగవుతారు ?  క్షేత్రస్ధాయిలో వాస్తవాలతో సంబంధంలేకుండా ఇంట్లో కూర్చుని కాపు సంక్షేమసేన పేరుతో ఏదేదో ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి జోగయ్య తృప్తి పడిపోతున్నారు. 175కి 175 సీట్లలో జగన్ను ఓడించాలంటే పై మూడుపార్టీలు ఏకం కావాల్సిందే అన్న జోగయ్య కోరిక తీరుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: