కొన్నాళ్లుగా సైలంట్ గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పాలనపై సైటైర్లతో విజృంభిస్తున్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో సాగింది నారావారి పాలన కాదని, సారా పాలన అని ఆమె తాజాగా ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మద్యం పాలసీతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న ఆమె.. జగన్ సర్కారు దశలవారీగా మద్యపాన నిషేధాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. టీడీపీ హయాంలో గుడి, బడి, అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేశారని రోజా అన్నారు. చంద్రబాబు చేసిన తొలి సంతకం బెల్టుషాపుల రద్దు అభాసుపాలైందని ధ్వజమెత్తారు.
రూ.2 లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నచంద్రబాబు దాన్ని ఎక్కడ అమలు చేశారో తెలియదు కానీ, వీధికో బెల్టుషాపు మాత్రం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ మంత్రి బీర్ హెల్త్ డ్రింక్ అని ప్రచారం చేసి మద్యం అమ్మకాలు పెంచేలా వ్యవహరించారని రోజా తప్పుపట్టారు. మద్యం పాలసీ వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
24 గంటలు ఏటీఎంలు ఉన్నాయో లేవో కానీ, చంద్రబాబు పరిపాలనలో ఎనీ టైమ్ మందు దొరికేదని రోజా సెటైర్ వేశారు. మద్యానికి పేదలను బానిసలుగా మార్చి వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. నారా వారి పాలన కాదు..సారా పాలన అని చంద్రబాబుపై ప్రజలు ముద్రవేసే విధంగా పాలించారని ఎద్దేవా చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి