ఆమె ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి.. హోంమంత్రి అంటే ఓ కాన్వాయ్ ఉంటుంది. రాజదర్పం ఉంటుంది.. కానీ కిందిస్థాయి నుంచి వచ్చిన ఏపీ హోమంత్రి మేకతోటి సుచరితకు ఆ రాజదర్పం మానవతకు అడ్డు కాదని నిరూపించారు. అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకే అని రుజువు చేశారు. నడిరోడ్డుపై ఫిట్స్‌ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత.


వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్‌ వచ్చింది. ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్‌ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి తన దారిన తాను వెళ్లి పోయాడు. జాతీయ రహదారి.. వందల వాహనాలు వెళ్తున్నాయి.. కానీ ఎవరూ ఆ ఫిట్స్ వచ్చిన వ్యక్తిపై జాలి చూపిన దాఖలాలు లేవు.. దారిన పోయే దాన్ని మనం ఎందుకు తగిలించుకోడం అన్న ఆలోచనతో తమ దారిన తాము పోతున్నారు. వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని చూసి పట్టించుకోకుండా వెళ్తున్నాయి.


అదే సమయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్.. సెక్రటేరియట్‌ నుంచి గుంటూరుకు వెళ్తోంది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఆ యువకుడిని గమనించారు. కాన్వాయ్‌ నిలిపి అతని వద్దకు వెళ్లారు.. అతనికి తాగునీరు అందించారు. సిబ్బందితో సమీపంలోని వైద్యులను పిలిపించి ప్రథమ చికిత్స చేయించారు.


ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో ఆతని వివరాలు తెలుసుకున్నారు. ఫోన్‌ ద్వారా నెల్లూరులోని యువకుడి అక్కకు సమాచారం అందించారు. యువకుడు స్పృహలోకి వచ్చిన తరువాత అతనిని పోలీసుల సహాయంతో నెల్లూరుకు బస్‌లో పంపించారు. మేకతోటి సుచరిత చేసిన ఈ సాయం ఓ ప్రాణాన్ని నిలబెట్టిందనే చెప్పొచ్చు. వెల్ డన్ హోం మినిస్టర్ గారూ.. !


మరింత సమాచారం తెలుసుకోండి: