భారత్‌ కు పొరుగున్న చిన్న దేశం నేపాల్ మిత్ర దేశం. ఆ దేశంలోకి వెళ్లాలన్నా.. అక్కడి నుంచి రావాలన్నా పాస్ పోర్టు కూడా అవసరం లేదు. చిన్నదేశమైన నేపాల్ చాలా విషయాల్లో భారత్ పై ఆధాపడుతుంది. తాజాగా ఈ రెండు దేశాల మధ్య పెట్రోలియం పైప్ లైన్ రెండు దేశాల స్నేహానికి గుర్తుగా మారింది.


భారత్‌లోని మోతీహరీ, నేపాల్‌లోని ఆమ్లేఖ్‌గంజ్‌ల మధ్య నిర్మించిన ఈ పెట్రోలియం పైప్ లైన్ ను ప్రధాని మోడీ, నేపాల్‌ ప్రధాని కె.పిశర్మ ఓలి సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ దవారా ప్రారంభించారు. ఇది ఆసియాలోనే మొట్టమొదటి సరిహద్దు పెట్రోలియం పైప్‌లైన్‌ కావడం విశేషం. ఈ పైప్ లైన్ ద్వారా ఏడాదికి రెండు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల పెట్రోలియం తరలించొచ్చు. ఈ పైప్ లైన్ పొడవు 69 కిలోమీటర్లు.


ఈ పైప్‌లైన్‌ ఏర్పాటు ద్వారా నేపాల్‌ ప్రజలు తక్కువ ఖర్చుతో పెట్రోలియం ఉత్పత్తులను పొందొచ్చు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఈ పైప్‌లైన్‌ ఇరు దేశాల మధ్య మైత్రికి నిదర్శనం అన్నారు. భారత్‌ నేపాల్‌ సంబంధాలు వివిధ రంగాల్లో విస్తరిస్తూనే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డ్‌ టైమ్‌లో ఈ ప్రాజెక్టు పూర్తికావడం సంతృప్తికరంగా ఉందన్నారు. తాను అంచనా వేసిన దానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి అయిందని మోడీ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఖాట్మండ్‌ను సందర్శించాలన్న ఓలి ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు.


ఈ పైప్‌లైన్‌ ఆలోచన ఈనాటిది కాదు.. దాదాపు పదేళ్ల నుంచి ఈ ఆలోచన ఉంది. కానీ 2015 నుండి ఇరు దేశాలు నిర్మాణ పనులను ప్రారంభించాయి. ఆ తరవాత పనులు జోరందుకున్నాయి. గత నెలలో ప్రయోగాత్మకంగా పెట్రోల్‌ను సరఫరా చేశారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, నేపాల్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: