ఏదైనా నమ్మాడంటే.. ఇక ఎవరు చెప్పినా వినడు..ఇది జగన్ గురించి చాలా మంది నాయకులు చెప్పేమాట. అలా జగన్ నమ్మకం పెట్టుకున్న అంశాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. మొన్నటికి మొన్న పోలవరం రివర్స్ టెండర్లపై ఎన్ని విమర్శలు వచ్చినా వెరవకుండా ముందుకే వెళ్లాడు.. ఏకంగా ఒక్క టెండర్‌లోనే దాదాపు 700 కోట్ల రూపాయలు ఆదా చేశాడు.


ఇప్పుడు పీపీఏ ల విషయంలోనూ విజయం సాధించాడు. తన వాదనకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్న రోజు నుంచీ ఇటు చంద్రబాబు, అటు కేంద్రం ఉలికులికి పడుతూనే ఉన్నాయి. అలా ఎలా చేస్తారంటూ అల్లరల్లరి చేస్తున్నాయి. కేంద్రం పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రారంటూ అడ్డుపుల్ల వేసే ప్రయత్నాలే చేసింది.


కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గ లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో విద్యుత్ కొనుగోళ్లను జరిపి, ఖజానాకు 2600 కోట్లు ఎందుకు భారం పెట్టాలి అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్షకు అవకాశమే లేదని కోర్టుకు వెళ్లాయి విద్యుత్ కంపెనీలు.


తాజాగా ఏపీ హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదననే సమర్థించింది. విద్యుత్ నియంత్రణమండలికి వెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుమతినిచ్చింది. విద్యుత్ ఒప్పందాల పునః సమీక్షపై వాదనలు ఏమున్నా ఏపీ ఈఆర్‌సీ ఎదుటే వినిపించమని హైకోర్టు విద్యుత్ సంస్థలకు సూచించింది. విద్యుత్ నియంత్రణా మండలి తీసుకునే నిర్ణయాలు తాము నిర్థారించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఆరునెలల్లోగా ఈ అంశంపై పరిష్కారం సూచించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలిని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: