జనసేన లాంగ్ మార్చ్ చేసిన ఉత్సాహం పూర్తిగా చల్లారకముందే.. ఆ పార్టీ నుంచి లాంగ్ జంప్ లు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పి. బాలరాజు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. జనసేనలో ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదని, ఆ పార్టీతో ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువ అని మాజీ మంత్రి పి.బాలరాజు వ్యాఖ్యానించారు.


ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. పవన్‌ కల్యాణ్‌ మార్చ్‌లు ఎందుకు చేపడుతున్నారని మాజీ మంత్రి పి.బాలరాజు ప్రశ్నించారు. విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీవో 97ను జారీచేయడం, పాడేరులో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం హర్షనీయమని మాజీ మంత్రి పి.బాలరాజు ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.


ప్రజలకు ఉపయోగపడతానని భావించే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని బాలరాజు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తే.. ఆయన వైసీపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు వైసీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్టు తెలుస్తోంది.


మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోయినా కనీసం గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటామని జనసేన నేతలు భావించారు. కానీ ఆ ఆశలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఏకంగా పార్టీ అధ్యక్షుడే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆ పార్టీ పై నాయకులకు ఆశలు గల్లంతయ్యాయి.


అందుకే వారు ప్రత్యామ్నాయమార్గాలు చూసుకుంటున్నారు. కొందరు బీజేపీలోకి మరికొందరు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లోనే జనసేనాని పవన్ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు లాంగ్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: