ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై ఎల్లో మీడియా కథనాలపై వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ అంశంపై మండిపడ్డారు. ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి పత్రిక వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే.. దాన్ని మతమార్పిడి కుట్రగా రాస్తారా అంటూ వైసీపీ మంత్రి మండిపడ్డారు. ఆంగ్ల మాధ్యమం ఉపయోగాల గురించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇంత చెప్పినా.. కొన్ని పత్రికలు, వ్యక్తులు అదేపనిగా దుష్ప్రచారం, విషం చిమ్మే మాటలతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మంత్రి సురేష్‌ మండిపడ్డారు.

 

సర్వేలు, గణాంకాల ద్వారా పేద, బడుగు, బలహీన, మైనార్టీలకు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లకు దూరంగా ఉన్నారని తేలిందని మంత్రి సురేశ్ అన్నారు. దళితుల్లో 49 శాతం, మైనార్టీల నుంచి 69 శాతం మంది మాత్రమే ఆంగ్లంలో చదువుతున్నారని విపులంగా చెప్పామన్నారు. ‘లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌’ అందించాలనేది ప్రభుత్వ సంకల్పమని మంత్రి సురేశ్ వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం హేయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, పిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు వాటన్నింటినీ అధిగమిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి సురేశ్ గుర్తుచేశారు.

 

ఆంగ్ల మాధ్యమం గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని అడిగితే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు రెండే అంశాలు దొరికాయన్నారు. ఇసుక, ఇంగ్లిష్‌ అయిపోయింది.. కొత్తగా మతపరమైన విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం ఒక మతానికి, ఒక వర్గానికి చెందిందని బురదజల్లేందుకు యత్నించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

 

ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నంత మాత్రాన మతమార్పడి జరుగుతుందా..? ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారి పిల్లలు అంతా మతం మారారా..?అని మంత్రి నిలదీశారుసుమారు 2 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారు.. వారంతా మతం మార్పిడి చేసుకుంటున్నారా..? అని మంత్రి సురేశ్ ప్రశ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: