దిశ రేపిస్టుల ఎన్‌ కౌంటర్ తో సెబరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి హీరోగా మారారు. ఆయన చేసిన పనిపై రాష్ట్రం నుంచే కాదు.. దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు అంతా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే స‌జ్జనార్ కు హైకోర్టు రూపంలో బిగ్ షాక్ తగిలింది. కొందరు వ్యక్తులు, కొన్ని మహిళాసంఘాలు ఈ ఎన్ కౌంటర్ పై శుక్రవారం సాయంత్రం హైకోర్టును ఆశ్రయించాయి.

 

దీంతో హైకోర్టు.. ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టనుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అందిన వినతిపత్రంపై న్యాయస్థానం అత్యవసరంగా స్పందించింది. ఇదే సమంయలో … లాగే శవపరీక్ష వీడియో, ఫోరెన్సిక్ నివేదిక, తదితర ఆధారాలను శనివారం సాయంత్రంలోగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్జికి ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

 

కొన్ని మహిళా సంఘాలతో పాటు వ్యక్తులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇలా స్పందించింది. అయితే ఓవైపు ఎన్‌హెచ్ ఆర్సీ విచారణ, మరోవైపు హైకోర్టు విచారణ నేపథ్యంలో సజ్జనార్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎన్‌ కౌంటర్ బూటకం అని తేలితే చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

మరోవైపు హైకోర్టు ఆదేశాలతో దిశ రేపిస్టుల అంత్యక్రియలు ఆగిపోయాయి. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కూడా నిందితుల శవాలను పరిశీలించాల్సి ఉంది. అంతకుముందు.. శుక్రవారం.. నిందితుల అంత్యక్రియలను రాత్రి లోగా నిర్వహించాలని భావించారు.

 

నారాయణ్‌పేట్ జిల్లా గుడిగండ్లకు చెందిన నిందితులు మహ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవుల అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు గాను పోలీసులు వ్యవసాయ పొలంలో గుంతలు తీశారు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో 9 వ తారీఖు తర్వాతే వీరికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: