తెలంగాణ ఉద్యోగులను ఏడాదిన్నర నుంచి ఊరిస్తూనే ఉంది పి.ఆర్.సి. సీఎం ఎప్పుడు తీపికబురు చెబుతారా..? అని ఎదురుచూస్తున్నారు. జూన్‌ 2న ఒకసారి, ఆగష్టు 15న మరోసారి వేచిచూసిన ఉద్యోగులు.. ఈ నెలాఖరు వస్తుందనే సమాచారంతో వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

 

ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం పీఆర్‌సీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయడం ఆన వాయితీ. దాని ప్రకారం తెలంగాణలో 2018 జులై 1 నుంచే కొత్త పి.ఆర్.సి అమలు కావాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు. 2018 మేలోనే పీఆర్‌సీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మూడు నెలల్లో రిపోర్ట్‌ వేయాలని ఆదేశించింది కూడా.. దీంతో రాష్ట్ర అవతరణ రోజు మధ్యంతర భృతిని ప్రకటిస్తారని ఉద్యోగులు వేచి చూసినా ప్రభుత్వం ప్రకటించలేదు.. ఆ తర్వాత ఆగష్టు 15 ప్రకటిస్తారేమోనని ఎదురు చూసినా అప్పటికీ.. ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి ఏవైనా పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. పీఆర్‌సీ పెంచుతారేమోనని ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు. 

 

తాజాగా ఆర్టీసీ కార్మికులకు వరాలు ప్రకటించడంతో మరోసారి ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. దానికి తోడు సీఎం కూడా పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని పే రివిజన్‌ కమీషన్‌ని ఆదేశించడంతో.. నెలఖరులోగా సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు ఉద్యోగ నేతలు. తెలంగాణలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని... పక్క రాష్ట్రంలానే ఇక్కడ కూడా 27 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగుల పదవి విరమణ వయో పరిమితిని కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.

 

మొత్తం మీద పీఆర్‌సీ సహా ఉద్యోగుల డిమాండ్లను ప్యాకేజీ రూపంలో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఎలాంటి న్యాయం చేస్తారోనని ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. పీఆర్ సీ ఎప్పుడు పెంచుతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఉద్యోగులు. ఇటీవలే ఆర్టీసీ కార్మికులను చేరదీసి వాళ్లపై వరాల జల్లులను కురిపించిన కేసీఆర్.. ఇపుడు తమకు కూడా తీపి కబురు అందిస్తారనే నమ్మకంతో ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: