గోదావరి చెంతనే ప్రవహిస్తోంది.. పరివాహక ప్రాంతాల్లో కరువు తాండవం చేస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుటికే సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. దుమ్ముగూడెం ఆనకట్టు ఆధునీకరించాలని నిర్ణయించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది.

 

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటుగా మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు డిజైన్ వ్యవహారాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండే చూసుకుంటున్నారు. పాత ఖమ్మం జిల్లాలో గోదావరి సుమారు 180 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు నీటిని అందించ వచ్చంటోంది ప్రభుత్వం. 

 

అశ్వాపురం మండలం వద్ద గోదావరి వద్ద ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. అయితే ఈ సీతారామ ప్రాజెక్ట వద్ద ప్రస్తుతం తక్కువ నీటిని నిలువ చేయనున్నారు. అయితే వేసవి కాలంలో కూడ సీతారామ నుంచి నీళ్లు వచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికను రూపొందించారు. దీని కోసం పాత దుమ్మగూడెం  ఆనకట్టను ఆధునీకరణ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభం  అయ్యాయి. 3400 కోట్ల రూపాయల తో దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను జారీ చేశారు. 63 మీటర్ల ఎత్తులో ఈ బ్యారేజీ నిర్మాణం సాగుతుంది. దీని వల్ల ఇక్కడ 37 టీఎంసీల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరు మీటర్ల వెడల్పుతో, ఆరు కిలోమీటర్ల పొడవున ఈ బ్యారేజీ నిర్మాణం జరుగనుంది. ఈ బ్యారేజీని 70రేడియల్ గేట్లనుకూడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

1865లో దుమ్ముగూడెం ఆనకట్టను సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది చెక్కు చెదర కుండా ఉంది. దశాబ్దాల క్రితమే దుమ్ముగూడెం అనకట్టను బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం హెవీ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. ఆనకట్ట గోదావరిలో వచ్చిన వరదలను కూడ తట్టుకుని నిలబడింది. ఈ ఆనకట్ట ప్రస్తుతం 4 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని 63 మీటర్ల ఎత్తుకు  పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం 2టీఎంసీల నిల్వ సామర్ద్యం గల ఆనకట్టను 37టీఎంసీలకు పెంచనున్నారు. 

 

155 ఏళ్ల చరిత్ర గలిగిన ఈ దుమ్ముగూడెం ఆనకట్టకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. గత యేడాది ఎన్నడు లేని విదంగా ఇక్కడ గోదావరిలో నీటి సమస్య వచ్చిపడింది. హెవీ వాటర్ ప్లాంట్‌కు గత యేడాది నీటి కొరత వచ్చింది. ఇక్కడ ఎత్తు పెంచడం ద్వారా అదనంగా నీటి నిలువ చేస్తే.. గోదావరి నుంచి సీతారామ ప్రాజెక్టు కోసం ఉపయోగపడుతుంది. అలాగే  ఇక్కడే ఉన్న హెవీ వాటర్ ప్లాంట్, మిషన్ భగీరథకు ఎటువంటి కొరత లేకుండా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సర్వే చేసి రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చారు అధికారులు. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే తమ కష్టాలు తీరుతాయంటున్నారు రైతులు.

 

దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద బ్యారేజీని నిర్మిస్తారా, తరువాత నిర్మిస్తారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ భారీ ఎత్తున ఇక్కడ గోదావరి నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సీత రామ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రిజర్వాయర్ సీఎం కేసీఆర్  ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణం కూడ అదే తరహాలో సాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: